Reading Time: 3 minutes

భారతదేశ సమకాలీన రాజకీయాల్లో ఎన్నికల వాగ్దానాల ఆశయానికి, మోసానికి మధ్య ఉన్న గీతను క్రమంగా మసకబారుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులకుఓటర్లకు మధ్య పవిత్ర ఒప్పందంగా భావించిన ఎన్నికల హామీలు, ఇప్పుడు అతిశయోక్తి వ్యాఖ్యలు, చిహ్నాత్మక ప్రకటనల నాటక రంగంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తామన్న హామీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘జుమ్లా’గా అభివర్ణించడం ఈ ధోరణికి ప్రతీకగా నిలిచింది. ఈ వ్యాఖ్య కేవలం ఒక ప్రధాన ఎన్నికల హామీని తేలికపరచడమే కాకుండా, రాజకీయ అసత్యాన్ని సాధారణీకరించే ప్రమాదకర ధోరణికి దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయ రాజకీయ చర్చల్లో ‘జుమ్లాలు’ ఒక్కటే సంఘటనలుగా మిగిలిపోకుండా, ఎన్నికల వ్యూహాల్లో భాగమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అసోం వంటి సున్నిత రాష్ట్రాల్లో, గోల్పారా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అసాధ్య హామీలు, విభజనాత్మక వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అసోంలో ప్రచార సభల్లో గిరిజన కుటుంబాలకు ఆవులు, ఎద్దులు పంపిణీ చేయడం, గోల్పారాలో కేంద్ర డెయిరీ ఏర్పాటు చేయాలన్న హామీ ఇవ్వబడినట్లు సమాచారం. ఇది గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా కనిపించినప్పటికీ, వాస్తవాలను పరిశీలిస్తే ఈ హామీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసోంలోని అనేక గిరిజన సమాజాల్లో పాల వినియోగం సంప్రదాయ ఆర్థిక కార్యకలాపం కాదు. ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే, అక్కడి గిరిజన సమూహాల ఆహారపు అలవాట్లు, ఆర్థిక వ్యవస్థలు భిన్నంగా ఉంటాయి. కొన్ని గిరిజన వర్గాలు గేదె మాంసాన్ని ఆహారంగా ఉపయోగించడం కూడా సాధారణమే. అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన నేపథ్యం నుండి వచ్చిన కిరణ్ రిజిజు వంటి నాయకులు బహిరంగంగా అంగీకరించిన వాస్తవం ఇది.

ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ హామీలు నిజంగా అభివృద్ధి లక్ష్యంగా ఉన్నాయా లేక స్థానిక సాంసృ్కతిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఒకే విధమైన గ్రామీణ అభివృద్ధి దృక్కోణం ప్రతిఫలమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాంప్రదాయకంగా పాలను వినియోగించని, ఉత్పత్తి చేయని వర్గాలపై పాడి ఆధారిత ఆర్థిక నమూనాను రుద్దడం అనేది స్థానిక పరిస్థితులపై సూక్ష్మమైన అవగాహన లోపాన్ని సూచిస్తుంది. అయితే ఆచరణ సాధ్యం కాని వాగ్దానాల కంటే, గుర్తింపు, పౌరసత్వం చుట్టూ అల్లుకున్న వాక్చాతుర్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమిత్ షా, అసోంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలను పదే పదే ‘చొరబాటుదారులు’గా పేర్కొంటూ, వారి చారిత్రక నేపథ్యాన్ని పక్కనబెట్టి బహిష్కరణకు పిలుపునివ్వడం అసోం ఒప్పందానికి వ్యతిరేకమని నిపుణులు అంటున్నారు. ఈ వాదన, అసోం ఒప్పందం ద్వారా స్థాపించిన చట్టపరమైన, చారిత్రక చట్రానికి తీవ్ర విరుద్ధంగా ఉంది. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు రాష్ట్రంలోకి వచ్చిన వారందరినీ భారత పౌరులుగా గుర్తించాలి.

ఈ చట్టపరమైన గడువు తేదీని విస్మరించడం గతంలో తీవ్ర ఆందోళనలకు ముగింపు పలికిన ఒప్పందాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చట్టపరమైన అనిశ్చితిని పెంచడమే కాకుండా, తరతరాలుగా అసోంలో నివసిస్తున్న సమాజాల్లో అసురక్షిత భావాన్ని పెంచుతున్నాయి. ఈ పరిమితిని విస్మరించి, బహిష్కరణ అనే ఒకే రకమైన వాదనను ప్రచారం చేయడం ద్వారా రాజకీయ నాయకులు సంవత్సరాల తరబడి సాగిన ఆందోళన, అశాంతికి ముగింపు పలికి, ఎంతో కష్టపడి సాధించిన ఏకాభిప్రాయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇటువంటి వాక్చాతుర్యం చట్టపరమైన అస్పష్టతను సృష్టించడమే కాకుండా, తరతరాలుగా అసోంలో నివసిస్తూ, దాని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, సాంసృ్కతిక స్వరూపానికి దోహదపడిన వర్గాల్లో అభద్రతను పెంచుతుంది.

2011 జనగణన ప్రకారం గోల్పారాలో ముస్లిం జనాభా 57 శాతానికి పైగా ఉంది. వీరిలో చాలా మంది దశాబ్దాలుగా, బహుశా శతాబ్దాల క్రితం అసోంలో స్థిరపడిన వారు వ్యవసాయం, పశుపోషణలో నిమగ్నమై ఉన్నారు. విచిత్రంగా, డెయిరీ రంగంలో వీరి భాగస్వామ్యం గిరిజన వర్గాల కంటే ఎక్కువగా ఉంది. అయినప్పటికీ అభివృద్ధి దృక్కోణంలో ఈ వర్గాలను విస్మరించడం పాలనలో సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గిరిజన సంక్షేమంపై దృష్టి పెట్టడం ముఖ్యమైనదే అయినప్పటికీ, అదే సమయంలో అదే ప్రాంతంలోని మెజారిటీ జనాభాను అణచివేస్తున్నప్పుడు అది పక్షపాతంగా కనిపిస్తుంది. ఈ పక్షపాత వైఖరి, పరిపాలనలో సమ్మిళితత్వం పైనా, సంక్షేమ పథకాలు పౌరులందరికీ సేవ చేసేలా రూపొందించారా లేక కేవలం రాజకీయంగా అనుకూలమైన వర్గాలకు మాత్రమేనా అనే దానిపైనా ప్రశ్నలను లేవనెత్తుతోంది.

బిజెపి గిరిజన హక్కులు, సాంసృ్కతిక పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఆచరణలో విరుద్ధతలు కనిపిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా క్రైస్తవులు లేదా స్థానిక మతాలను అనుసరిస్తారు. అక్కడ గేదె మాంస వినియోగం సాధారణం. ఈ నేపథ్యంలో పశువుల ఆధారిత ఆర్థిక పథకాలను ప్రవేశపెట్టడం వెనుక అభివృద్ధి లక్ష్యాలున్నాయా లేక సిద్ధాంతాత్మక ప్రతీకలున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసోం రాష్ట్రం సాంసృ్కతిక సమన్వయానికి, మత సామరస్యానికి ప్రసిద్ధి. శ్రీమంత శంకరదేవ్ బోధనలు సమానత్వం, ఏకత్వాన్ని ప్రతిపాదించాయి. ఆయన నవ వైష్ణవ ఉద్యమం, కుల, మత, జాతి భేదాల అడ్డంకులను అధిగమించి, అస్సామీ గుర్తింపును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది.

ఈ చారిత్రక నేపథ్యానికి విరుద్ధంగా ఎన్నికల ప్రచారాల్లో మత, భాష ఆధారిత విభజన వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. మత లేదా భాషా ప్రాతిపదికన వర్గాలను విభజించే ప్రకటనలు, శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని నిలబెట్టిన సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ వారసత్వం, మైనారిటీ సంక్షేమం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీపై మైనారిటీ అనుకూల విధానాల ఆరోపణలు ఉన్నప్పటికీ, సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో తీసుకున్న సంక్షేమ చర్యలు రాజకీయ ప్రలోభాల కంటే సామాజిక అసమానతలను తగ్గించడానికే ఉద్దేశించబడ్డాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్షిత సంక్షేమ చర్యలు, శాంతింపజేసే చర్యలు కావు, అవి వ్యవస్థాగత అసమానతలను పూడ్చే ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలు సరిపోతాయా లేదా ప్రభావవంతంగా ఉన్నాయా అనేది చర్చనీయాంశం.

కానీ అవి ఎన్నికల ప్రసంగాలమీద కాకుండా అనుభవపూర్వక గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యువతలో రాజకీయ అవగాహన పెరుగుతోంది. జెన్-జెడ్ తరానికి చెందిన ఓటర్లు ఉద్యోగాలు, విద్య, పరిపాలన వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అతిశయోక్తి హామీలు, విభజనాత్మక వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ మీడియా పెరుగుదలతో నాయకుల ప్రకటనలను సులభంగా పరిశీలించే అవకాశం లభిస్తోంది. అసోంలో యువ ఓటర్ల అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వారిలో చాలామంది గొప్ప వాగ్దానాలు, విభజనవాద కథనాలపట్ల సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ మీడియా ఆవిర్భావంతో, వాదనలను వాస్తవ నిర్ధారణ చేయడం, నాయకులను జవాబుదారీగా ఉంచడం సులభమైంది. దీనివల్ల, రాజకీయ సాధనంగా ‘జుమ్లాల’ ప్రభావం తగ్గింది.

ఎన్నికల సమయంలో అతిశయోక్తి హామీలు, విభజనాత్మక వ్యాఖ్యలు ప్రజాస్వామ్య నైతికతకు సవాలుగా మారుతున్నాయి. అసోం వంటి సున్నిత రాష్ట్రంలో ఈ ధోరణి మరింత ప్రమాదకరం. స్థానిక వాస్తవాలకు అనుగుణంగా విధానాలు రూపకల్పన చేయడం, చట్టపరమైన ఒప్పందాలను గౌరవించడం అత్యవసరం. వలసలు, గుర్తింపు, సాంసృ్కతిక వైవిధ్యం వంటి సంక్లిష్ట చరిత్ర కలిగిన అసోం రాష్ట్రంలో, ఇటువంటి విధానాలు ప్రత్యేకంగా ప్రమాదకరమైనవి. విధానాలు స్థానిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి. రాజకీయ చర్చలు అసోం ఒప్పందం వంటి స్థిరపడిన చట్టపరమైన చట్రాలను గౌరవించాలి. చివరకు బాధ్యత కేవలం రాజకీయ నాయకులదే కాకుండా ఓటర్లది కూడా. ఓటర్లు మరింత అవగాహనతో, వివేచనతో వ్యవహరిస్తేనే బాధ్యతాయుత పాలనకు మార్గం సుగమమవుతుంది. ‘జుమ్లాలు’ ఎన్నికల రాజకీయాలను నిర్ణయిస్తాయా లేక బాధ్యతాయుత పరిపాలనకు రాజకీయ పార్టీలు మార్గం సుగమం చేస్తాయా అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.

–  గీతార్థ పాఠక్ ( ఈశాన్యోసనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు