Reading Time: 2 minutes

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దళారులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ సర్వేనెంబర్ 507, 508, 548లలో గత ప్రభుత్వం పండ్ల మార్కెట్ కోసం సుమారు 200 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి టీజీఐఐసీ పేరుతో కొన్ని బడా కంపేనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో సోమవారం హరీష్‌రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌లతో కలిసి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి కోహెడ ప్రూట్ మార్కెట్ పరిరక్షణ భూ బాధితుల సమావేశంలో హరీష్‌రావు ప్రసంగించారు.

రైతులు, ప్రజల మేలుకోరుతూ వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం పనులు చేయాలి కానీ దళారులు, వ్యాపారుల కోసం పనులు చేపట్టవద్దని మండిపడ్డారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం, ప్రజల ఆరోగ్యం దృష్టా, దూరదృష్టితో కొత్తపేట్‌లో ఉన్నటువంటి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను అంతర్జాతీయ హంగులతో ప్రణాళికాబద్ధంగా కోహెడలో ఏర్పాటుచేయాలనే ఉద్ధేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిని కేటాయించారన్నారు. జీవో 11 ద్వారా మార్కెట్‌ను నోటిఫై చేయడంతో పాటు డీపీఆర్ సిద్ధం చేసి 2023లో జీవో 216తో రూ.350 కోట్లను మార్కెటింగ్ శాఖ నుంచి కేటాయించినట్లు గుర్తుచేశారు. ఇదీ కాక గతంలో మార్కెట్ కోసం భూములు కోల్పోతున్న 150 మంది రైతులకు సుమారు రూ.10 కోట్లను నష్టపరిహారం అందజేశామన్నారు. మార్కెట్ నిర్మాణానికి టెండర్‌లు పిలిచి పనులు ప్రారంభించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ దాహంతో ప్రాసింగ్ యూనిట్‌లు పెడతామని కల్లబొల్లి మాటలు చెప్పి, వివాదాల్లో ఉన్న దిల్ (దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) అనే సంస్థకు చెందిన భూములలో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నామని, రైతులను మభ్యపెడుతున్నారు. ఇదే దిల్ భూములపై హైకోర్టులో కేసున్నది.

అదే భూములలో తమకు వాటా ఉన్నదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇన్ని సమస్యలున్న భూముల్లో మార్కెట్ ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్ల 6 నెలలు దాటినా ఎలాంటి కార్యరూపం దాల్చలేదని విరుచుకుపడ్డారు. టీజీఐఐసీ పేరుతో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని దళారులకు ధారాదత్తం చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేగాక ఇటీవల కేరళ, చెన్నైలకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు ఈ భూములను సందర్శించినట్లు సమచారం ఉందన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో కేటాయించిన పండ్ల మార్కెట్ స్థలంలో మార్కెట్ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే బీఆర్‌ఎస్ పార్టీ సహించదని, రైతులకు అండగా ఉంటూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, వంగేటి లకా్ష్మరెడ్డి, సత్తు వెంకట రమణారెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, దండెం రాంరెడ్డి, రాం నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.