
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండపేట మండలం తాపేశ్వరం శివారులో కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు.
అసలేం జరిగిందంటే..? అనపర్తి మండలం వెలగతోడు గ్రామానికి చెందిన భోగిల్లి వీర వెంకట సతీష్ రాజమహేంద్రవరం లోని పేపర్ మిల్లు లో ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య కిరణ్మయి, తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కలిసి ఏప్రిల్ 3వ తేదీన కాకినాడలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. వేడుక ముగించుకుని రాత్రి సమయంలో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. తాపేశ్వరం శివారు పేకెటిపాకల వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సతీష్ (40), ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య కిరణ్మయి (36) కారులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
అయితే వెనుక సీట్లో కూర్చున్న సతీష్ తల్లిదండ్రులు ,ఇద్దరు చిన్నారులను స్థానికులు గమనించి తక్షణమే స్పందించి ప్రాణాలతో బయటకు తీయగలిగారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ దొరరాజు, ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును కాలువలో నుంచి బయటకు తీసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తూ మార్గమధ్యలోనే దంపతులు మృతి చెందడంతో వెలగతోడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రూరల్ ఎస్ ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ దొరరాజు తెలపారు.