Reading Time: < 1 minute

కస్టమ్స్ అధికారులుగా చెప్పి.. రూ.25 కోట్ల బంగారం దోపిడీ చేసిన బీహార్ గ్యాంగ్

Caption of Image.

రాజ్‌కోట్‌కు చెందిన ఒక నగల వ్యాపారికి సంబంధించిన సుమారు 25 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్నారు.  సమాచారం ప్రకారం… గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి సంస్థ కేవీ & సన్స్ లో మహేష్, ప్రిన్స్ అనే ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లిద్దరు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను తీసుకుని డెలివరీ ఇచ్చేందుకు రైలులో బీహార్‌కు వెళ్లారు. అక్కడ వారు రైల్వే స్టేషన్‌లో దిగగానే, పక్కా ప్లాన్‌తో ఉన్న సుమారు ఎనిమిది మంది దుండగులు వీరిని చుట్టుముట్టారు.

అయితే దొంగలు సాధారణ దొంగల్లా కాకుండా, మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్  అధికారులమని చెప్పి నమ్మించారు. తరువాత చెకింగ్   చేయాలని చెప్పి, ఆ ఇద్దరు ఉద్యోగులను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పడంతో  బాధితులు కూడా నిజమైన అధికారులు కావొచ్చని భ్రమపడ్డారు.

తరువాత కారులో వారిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన  అక్కడ  వారి దగ్గర ఉన్న 25 కోట్ల విలువైన బంగారాన్ని లాక్కుని  వారిని రోడ్డు పక్కన వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

దింతో బాధితులు వెంటనే యజమానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు.

దొంగలు వాడిన కారును పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోగా… సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ కేసులో  రాజ్‌కోట్ నుంచి ఒక ప్రత్యేక పోలీసు బృందం కూడా బీహార్‌కు వెళ్లనుంది. అయితే పక్కా సమాచారం, ప్లాన్ తోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.