
ప్రపంచ ఇంధన మార్కెట్లో యుద్ధపు సెగలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రూడ్ ఆయిల్ రేట్లను ఆకాశానికి చేర్చాయి. తాజాగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ ట్రంప్ విధించిన గడువు ముగియనుండటంతో.. సరఫరా వ్యవస్థపై ఆందోళనలు పెరిగి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 111.63 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ క్రూడ్ ఏకంగా 116.87 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు దాదాపు 90 శాతం మేర పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తోంది.
రాజకీయంగా చూస్తే.. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ తన షరతులకు లొంగకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని, ఒక్క రాత్రిలోనే ఇరాన్‌ను దెబ్బతీస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. అయితే ప్రపంచ ఆర్థిక శక్తి అయిన అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోందని నిపుణులు అంటున్నారు.
ప్రపంచ క్రూడ్ రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ఫిబ్రవరి 27న 72.48 డాలర్లుగా ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర.. మార్చి నాటికి 119 డాలర్లకు చేరడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత మార్కెట్ల విషయానికొస్తే సెన్సెక్స్, నిఫ్టీలు 1 శాతం వరకు నష్టపోగా.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. చమురు ధరలు ఇలాగే పెరిగితే దిగుమతి ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఈ మైండ్ గేమ్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది ఆర్థికంగా, రాజకీయంగానూ.