Reading Time: < 1 minute
Rishabh Pant Vs Srh Pants Stunning Record Continues In Ipl 2026 As Lsg Beat Srh

Rishabh Pant vs SRH: ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ) అద్భుత విజయాన్ని అందుకుంది. మహ్మద్‌ షమీ (2/9) దెబ్బకు మొదట ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులే చేసింది. లక్షాన్ని ఎల్ఎస్‌జీ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో రిషబ్ పంత్‌ (68 నాటౌట్‌; 50 బంతుల్లో 9×4) కీలక పాత్ర పోషించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు బెంబేలెత్తించినా.. పంత్ తన దూకుడుకు విరుద్ధంగా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌కు మరోసారి కొరకరాని కొయ్యగా మారాడు.

ఐపీఎల్‌లో రిషబ్ పంత్‌ ఇప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్‌పై 19 ఇన్నింగ్స్‌లు ఆడి 626 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అతని సగటు 44.71గా ఉండటం గమనార్హం. ఇక స్ట్రైక్ రేట్ 143.24గా ఉండటం పంత్ దూకుడు, స్థిరత్వానికి నిదర్శనం. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు అతడు బలంగా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌లో పంత్ ఎప్పుడూ దూకుడుగా ఆడాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అంటేనే రిషభ్ పంత్ రెచ్చిపోతున్నాడని చెప్పుకోవచ్చు. అతని గణాంకాలు చూస్తే భవిష్యత్తులో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌పై అతను మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి. పంత్ గణాంకాలు చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ’, ‘పంత్ అన్నా.. ఎందిది’ అంటూ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు.