Reading Time: < 1 minute

కళలు, సాహిత్యాల పుట్టినిల్లు సిద్దిపేట : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

Caption of Image.

సిద్దిపేట, వెలుగు: తెలంగాణ ఉద్యమ చరిత్రలో సిద్దిపేట జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల అంతర్జాల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళలకు, సాహిత్యానికి సిద్దిపేట పుట్టినిల్లు అని పేర్కొన్నారు.

కాపురాజయ్య కళాఖండాలు, చేర్యాల నగిషీలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని తెలిపారు. సిద్దప్ప తత్వాలు, గడ్డం రామదాసు యక్షగానాలు లాంటి అనేక సాహిత్య ప్రక్రియలు సిద్దిపేట జిల్లా నుంచే వెలువడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో సిద్దిపేట జిల్లా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ.. దూలిమిట్ట శివాలయంలో 12 వీరగల్లులు లభించడం సిద్దిపేట చారిత్రక నేపథ్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సునీత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గ్రహీత అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి, కొండి మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.