
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు, కేవలం కెమెరా వెనుక ఉండి మ్యాజిక్ చేయడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆయన భాగస్వామ్యంలో ఒక ప్రైవేట్ వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపుదిద్దుకుంది. రాజమౌళి సినిమాల్లో విజువల్స్ అంటేనే ఒక అద్భుతం, బాహుబలి నుండి ఆర్.ఆర్.ఆర్ వరకు ఆయన సృష్టించిన విజువల్ వండర్స్ వెనుక విదేశీ సంస్థల హస్తం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఈ కొత్త స్టూడియోలోకి తీసుకొచ్చారు. దీనివల్ల భారీ బడ్జెట్ సినిమాల అవుట్‌పుట్ మరింత వేగంగా, నాణ్యంగా వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ స్టూడియోలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పనులు జరుగుతున్నాయి, ముఖ్యంగా వారణాసి నేపథ్యంతో వస్తున్న భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మెజారిటీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇక్కడే జరుగుతుండటం విశేషం. ఈ ఒక్క స్టూడియోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పేరున్న మరో నాలుగైదు అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థలు కూడా దీనితో చేతులు కలిపి పనిచేస్తున్నాయి, సినిమాలో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలని తపించే రాజమౌళి, వీఎఫ్ఎక్స్ విషయంలో అస్సలు రాజీపడరు. ఇప్పుడు ఏకంగా తన పర్యవేక్షణలోనే స్టూడియో అందుబాటులోకి రావడంతో, రాబోయే సినిమాల్లో విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు, తన అభిరుచికి తగ్గట్లుగా ప్రతి షాట్‌ను తీర్చిదిద్దుకునే వీలు కలగడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపై తెలుగు సినిమా తెరపై కనిపించే ప్రతి అద్భుతం మన గడ్డపై, మన టెక్నాలజీతోనే రూపుదిద్దుకోవడం గర్వించదగ్గ విషయం.