
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) 1948లో స్థాపించిన సందర్భంగా మొదటి ప్రపంచ ఆరోగ్య సభలు నిర్వహించి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా 1950 నుండి జరుపుకుంటున్నారు. నిజానికి ప్రపంచం మొదటి ఆరోగ్య దినోత్సవాన్ని 22 జులై, 1949 జరుపుకున్నారు. కానీ విద్యార్థుల భాగస్వామ్యం కోసం ఏప్రిల్ 7కు మార్చారు. ప్రపంచంలోని 51 దేశాలు స్థాపకులుగా, 10 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేసి మొత్తం 61 దేశాలు పాలుపంచుకొని 1946 జులై నుండి ఆరోగ్య సంస్థ రాజ్యాంగం ఆమోదించబడి, 1948 ఏప్రిల్ 7 నుండి అమలు చేయబడి, 1950 నుండి డబ్ల్యుహెచ్‌ఒ సిబ్బంది, దేశాల సంబంధిత సమర్పణల మేరకు డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కోసం ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశం (థీమ్) ఎంచుకోవడం జరుగుతుంది. 2024- 25 అంచనాల ప్రకారం ప్రపంచం లో 2.15 డాలర్లు (180- 190 రూపాయలు) కూడా ఖర్చు పెట్టలేని జనాభా 8.5-10% (690- 800 మిలియన్ల ప్రజలు) తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల లాంటివి పరిగణనలోకి తీసుకుంటే 18% (1.1 బిలియన్లకు పైగా ప్రజలు) తీవ్రమైన పేదరికంలో ఉన్నట్లు తెలుస్తున్నది.
కొవిడ్-19 మహమ్మారి తర్వాత సంఘర్షణలు, ఆర్థిక మందగమనం, యుద్ధాలు లాంటి పరిస్థితుల వల్ల పేదరిక నిర్మూలన నెమ్మదించింది. పేదలపరంగా సబ్ సహారన్, ఆఫ్రికా దారుణంగా ఉన్నది. ప్రపంచంలో ఇప్పటికీ 30 శాతం మంది ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య వసతులు లేవు. ప్రపంచంలో 1800 సంవత్సరంలో తీవ్ర పేదరికం 80 శాతం ఉంటే, 2025 నాటికి 10% తగ్గిపోయినప్పటికీ చాలామంది ప్రజల జీవితాలు దుర్భరంగానే ఉన్నాయి. కానీ ఐక్యరాజ్య సమితి సవాళ్లు ఉన్నప్పటికీ 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. నిజానికి ప్రపంచ దేశాలలో నిద్ర లేచినప్పటి నుండి ఈ రోజు పూట గడవడం ఎలా అని పుట్టెడు ఆలోచనలు చేసే ప్రజలు పొద్దున్నే నిద్ర లేచి, వ్యాయామం చేసి, సంతులిత ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే స్పృహ ఎక్కడున్నది? రోజుకు ఒక ఆపిల్ తిను ఆరోగ్యంగా ఉండు అంటున్నాం, కాని ప్రజలందరూ కొని తినగలిగే స్థితిలో ఉన్నారా? వ్యాయామం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటున్నాం, కానీ పేదలు వ్యాయామం చేసే స్థితిలో ఉన్నారా? వ్యాయామం చేసే స్థితిలో ఉన్న ప్రజలు కూడా అవగాహన రాహిత్యంతో ఆచరించలేకపోతున్నారు.
మన దేశంలో 2026-27 బడ్జెట్ ప్రకారం కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ.1,06,530.42 ఇది గత సంవత్సరం కంటే 10% అదనం. ప్రజారోగ్యంపై జిడిపిలో1.8%-, 1.9% మాత్రమే. నిజానికి జిడిపిలో కనీసం 2.5% ఆరోగ్యానికి ఖర్చు చేయాలనుకొని గత 12 సంవత్సరాలుగా నిధుల పెరుగుదలలో 194% పెరిగినప్పటికీ అనుకున్న లక్ష్యానికి చేరుకోలేదు. 2024-25 నివేదికల ప్రకారం జాతీయ ఆరోగ్య మిషన్ నిధులలో కేవలం 62% మాత్రమే ఉపయోగించబడ్డాయి. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం దేశంలోని 50 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సేవలను ఉపయోగించుకోక నిరీక్షణవల్ల మందులు, యంత్రాలు నాణ్యత కోల్పోతున్నాయి. దేశంలో 2025 -26 నాటికి రాష్ట్రాలు తమ బడ్జెట్లో 6.2% ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెట్టాయి. నిజానికి 2020 నాటికే రాష్ట్రాలు తమ బడ్జెట్లో కనీసం 8% ఆరోగ్య సంరక్షణకు ఖర్చు చేయాలని జాతీయ ఆరోగ్య విధానం 2017 సిఫార్సు చేసింది. కానీ 2025- 26 నాటికి కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే ఆరోగ్యానికి తమ బడ్జెట్లో 8 శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించాయి.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఎదుర్కొంటున్నారు ఇందుకు కారణం బలమైన ఆర్థిక అసమానతలు. సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ నేల మీద విద్య, ఆరోగ్యం అనే రెండు అంశాలు ఎంతో ప్రాశస్తం గలవి. అందుకే ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉచిత వైద్యం, ఉచిత విద్య అందరికీ అందేటట్లు చూసినప్పుడు ఆరోగ్య ప్రపంచాన్ని చూడవచ్చు. అలా కానీ ఎడల ప్రపంచ ఆరోగ్య దినాలను రోజూ జరుపుకున్నా ఫలితం నామ మాత్రమే. ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తూ తుల పట్ల జాగరుకుతతో ఉండేటట్లు చూడాలి. ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేయనంతవరకు ఎన్ని ప్రయోజనాలు చేకూర్చిన నిష్ప్రయోజనమే.
– డా. కావలి చెన్నయ్య
9000481768