Reading Time: < 1 minute
Ap Weather Forecast Rain Thunderstorms And Heatwave Alerts Across Andhra Pradesh For Next 2 Days

ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి.. వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర–పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం (ఏప్రిల్ 7) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మనుబోలు, చిల్లకూరు, గుడూరు ప్రాంతాల్లో, తిరుపతి జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల ప్రజలు అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, లేదంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read: TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

నేడు రాష్ట్రంలో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురంలో 42 డిగ్రీల సెల్సియస్, కడపలో 41.9 డిగ్రీలు, మార్కాపురంలో 40.7 డిగ్రీలు, నంద్యాలలో 40.6 డిగ్రీలు నమోదయ్యాయి. నెల్లూరు 40.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా 40.1 డిగ్రీలు, కర్నూలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా ఉండాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.