
గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భూ ఆక్రమణలపై తీసుకున్న చర్యలతో హైడ్రాపై ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 06) హైడ్రా ప్రజావాణికి 53 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కూకట్‌పల్లిలో రూ.6 వేల కోట్ల భూమి వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. తప్పుడు పత్రాలతో హక్కులు క్లైమ్ చేస్తున్నారనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్ రంగనాథ్ సంబంధిత అధికారులకు విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నేరేడ్‌మెట్‌లో స్మశాన భూమిని ఇంటి స్థలంగా మార్చే ప్రయత్నం అంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు.
అదేవిధంగా కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ భూములపై కబ్జాలను హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు. మొగుల్ల చెరువు బఫర్‌లో 23 గుంటల భూమి ఆక్రమణలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. గోపన్నపల్లి వసుంధర ఎస్టేట్స్ లేఅవుట్ వివాదం కూడా హైడ్రా ముందుకు వచ్చింది. 2 ఎకరాల 10 గుంటల భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా విక్రయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఅవుట్‌లో రోడ్లు, పార్కులు కాపాడాలని నివాసితులు డిమాండ్ చేశారు.
అత్తాపూర్ దగ్గర మూసీ నదిలో అక్రమ డంపింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. రోజుకు 50 ట్రక్కుల చెత్తతో నది ఆక్రమిస్తున్నట్లు కంప్లైంట్ చేశారు. దేవాదాయ శాఖ భూములపై నకిలీ క్లెయిమ్స్ చేసుకుంటున్నట్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులన్నింటినీ సావధానంగా విన్న కమిషనర్.. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.