
టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగా కుటుంబ హీరోలతో తనకున్న అనుబంధాన్ని, పని చేసిన అనుభవాలను వివరించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఠాగూర్’ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అని, ఆ చిత్రంతోనే తన కలలన్నీ నెరవేరాయని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నం. 150’ చేసే సమయంలో ఎంతో నమ్మకంతో పనిచేశామని, సినిమా పట్ల చిరంజీవికి ఉన్న అంకితభావం అద్భుతమని వినాయక్ కొనియాడారు.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ, కథ విషయంలో ఇద్దరికీ పూర్తి సంతృప్తి కలగకపోవడంతో ఆ ప్రాజెక్టును పరస్పర అంగీకారంతో పక్కన పెట్టినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో మంచి కథ దొరికినప్పుడు తప్పకుండా సినిమా చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్‌తో ‘నాయక్’ సినిమా చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, చిన్నప్పటి నుంచి చూసిన చరణ్ ఒక పెద్ద స్టార్‌గా ఎదగడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తాను చేసిన ‘బన్నీ’, ‘బద్రీనాథ్’ చిత్రాల గురించి కూడా వినాయక్ మాట్లాడారు. ‘బద్రీనాథ్’ చిత్రం అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటివారు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. వారి కష్టం, కథల ఎంపిక, విజన్ చూస్తుంటే భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని వినాయక్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, దర్శకుడు వి.వి. వినాయక్ కెరీర్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం ఆయన నటుడిగా మారాలనుకోవడం. ‘శీనయ్య’ అనే సినిమాతో ఆయన హీరోగా పరిచయం కావాల్సి ఉంది. దిల్‌రాజు నిర్మాణంలో, నరసింహారావు దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. వినాయక్ ఈ పాత్ర కోసం తన రూపురేఖలను కూడా మార్చుకున్నారు. అయితే, కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా అవుట్‌పుట్ విషయంలో వినాయక్, నిర్మాత దిల్‌రాజు సంతృప్తిగా లేకపోవడమే ‘శీనయ్య’ ఆగిపోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అలాగే పలు అనారోగ్య కారణాల వల్ల కూడా ఇన్నేళ్లు వినాయక్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇది చదవండి: ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే.. ఈ అలనాటి నటి ఎవరో గుర్తుపట్టారా.?