Reading Time: < 1 minute
Helmet Awareness: హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంతో పాటు కోల్పోతున్న ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో జిల్లా పోలీసు యంత్రాంగం సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వాహనదారులకు సూచనలు చేస్తోంది. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదన్న అంశాలపై విస్తృత ప్రచారం చేస్తుంది. ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలు నడిపే వారు విధిగా హెల్మెట్ ధరించేలా చేస్తోంది.

ఇందులో భాగంగానే హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుతూ.. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు వారాంతంలో, నెలవారీగా లక్కీడ్రాల ద్వారా నగదు బహుమతులు అందజేస్తోంది.

హెల్మెట్‌ లేకుండా జరిమానాలు వేసుకునే బదులు.. హెల్మెట్ పెట్టి బహుమతులు గెలుచుకోండని పోలీసులు యంత్రాంగం ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమం కింద మొత్తం రూ.1,67,000 విలువైన బహుమతులను పోలీసులు అందజేయనున్నారు. ఇందులో నగదు బహుమతులతో పాటు మెమెంటోలు, సర్టిఫికేట్లు కూడా ఉండనున్నాయి. ఈ గిఫ్ట్‌ల కోసం నమోదు చేసుకునేందుకు వీలుగా చిత్తూరులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మ్యాన్‌వల్‌గానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా నమోదు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు పోలీసులు. Instagram అకౌంట్ spchittoor, Facebook: Chittoordistrictpolice , WhatsApp: 9154881257 ద్వారా నమోదు చేసుకునేందుకు పోలీసు యంత్రాంగం అవకాశం కల్పించింది. మరిన్ని వివరాల కోసం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు 9491074515 ను సంప్రదించ వచ్చని పేర్కొంది. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని, రోడ్డు భద్రతకు సహకరించాలని యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.