
Extramarital Affair: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఓ ప్రాణం బలి అయ్యింది. సైయా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మృతుడి భార్య, ఆమె ప్రియుడు, మరొకడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైయా నివాసి లోకేంద్ర అనే వ్యక్తి ఏప్రిల్ 1, 2026న అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, దేవీ సింగ్ పురా మార్గంలోని ఒక పొలంలో సగం కాలిన మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు శివచరణ్ ఆ మృతదేహం లోకేంద్రదేనని గుర్తించాడు. తన సోదరుడు చివరిసారిగా గ్రామానికి చెందిన మహేష్ ప్రజాపతితో కలిసి వెళ్లడం చూశానని, అలాగే తన వదినకు, మహేష్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానాన్ని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ కేసును ఛేదించేందుకు ఆగ్రా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్ఓజి (SOG), సర్వైలెన్స్, సైయా పోలీసులతో కూడిన 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డ్స్ (CDR) విశ్లేషించిన తర్వాత, ఏప్రిల్ 3న పోలీసులు ప్రధాన నిందితుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధర్మవీర్, మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం చేతిపై ఉన్న పేరు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు లోకేంద్ర హత్యను ధృవీకరించారు.
Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
విచారణలో నిందితుడు మహేష్ తన నేరాన్ని అంగీకరించాడు. మృతుడి భార్యకు, మహేష్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి లోకేంద్రకు తెలియడంతో వారు అతడిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుండి బయటకు రాగానే అతని భార్య ఫోన్ చేసి మహేష్‌కు సమాచారం ఇచ్చింది. మహేష్ తన బైక్ పై లోకేంద్రను ఎక్కించుకుని, తన స్నేహితుడు ధర్మవీర్ తో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించిన తర్వాత, లోకేంద్ర గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు పెట్రోల్, గోధుమ గడ్డి వేసి నిప్పంటించారు. ఈ కేసులో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు.