
MS Dhoni Injury Update: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్లతో జరిగిన పోరులో చెన్నై ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. మైదానంలో ధోనీ మార్గనిర్దేశం లేకపోవడం, వికెట్ల వెనుక ఆయన చాకచక్యం లోపించడం జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. పిక్క కండరాల గాయం కారణంగా మొదటి రెండు వారాలు ధోనీ అందుబాటులో ఉండరని యాజమాన్యం ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన రాకను త్వరితగతిన ఖరారు చేశారు.
ముందస్తు రీఎంట్రీ.. ఏప్రిల్ 11న రంగంలోకి ‘తలా’
నిజానికి ధోనీ ఐదో మ్యాచ్‌లో కోల్‌కతాపై పునరాగమనం చేస్తారని అందరూ భావించారు. కానీ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడటంతో, చెన్నై యాజమాన్యం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 11న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనే ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. ఒకవేళ ఈ పరీక్షలో ధోనీ నెగ్గితే, సొంత గడ్డపై అభిమానుల కేరింతల మధ్య ధోనీ మెరుపులు మెరిపించడం ఖాయం.
ఫినిషర్‌గా ధోనీ ప్రాముఖ్యత..
వయసు పైబడుతున్నా ధోనీ ఫినిషింగ్ సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదు. వికెట్ కీపింగ్‌లో మెరుపు వేగంతో స్పందించడమే కాకుండా, క్లిష్ట సమయాల్లో బౌలర్లకు సరైన సలహాలు ఇవ్వడంలో ఆయన దిట్ట. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ధోనీ అనుభవం జట్టుకు ఎంతో అవసరమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చెన్నై పట్టుదలతో ఉంది. ఈ కీలక పోరులో ధోనీ రాక జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..