Reading Time: 2 minutes
Srh Vs Lsg Controversy Avesh Khan Incident Bcci Complaint Ipl 2026

Sunrisers Hyderabad to Complain BCCI Over Avesh Khan Incident: సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతితో ఘోరంగా ఓడిపోయింది. అయితే.. ఈ సీజన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసి రాలేనట్టుంది. వరుసగా వివాదాలు హైదరాబాద్‌ టీమ్‌ను చుట్టుముడుతున్నాయి. ఈ వివాదాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేయాలని సన్‌రైజర్స్ నిర్ణయించుకున్నట్లు క్రిక్‌బజ్ నివేదించింది. ముఖ్యంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ‘అవేష్ ఖాన్ ఘటన’ సన్‌రైజర్స్ యాజమాన్యానికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

READ MORE: Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. లక్నో గెలుపునకు రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సిన ఉండేది. ఈ సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో బౌండరీ లైన్ అవతల డగౌట్ సమీపంలో ఉన్న లక్నో ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్, తన చేతిలో ఉన్న బ్యాట్‌తో ఆ బంతిని వెనక్కి కొట్టాడు. అయితే, అవేష్ బంతిని తాకే సమయానికి అది ఇంకా బౌండరీ లైన్‌ను దాటలేదని రిపీట్లలో స్పష్టమైంది. దీంతో నిబంధనల ప్రకారం తమకు ఐదు పెనాల్టీ పరుగులు కేటాయించాలని సన్‌రైజర్స్ వాదించింది. కానీ, అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరని, బంతి ఎలాగూ బౌండరీకి వెళ్లేదే కాబట్టి పెనాల్టీ ఇచ్చే అవకాశం లేదని అంపైర్లు స్పష్టం చేయడంతో వివాదం చెలరేగింది. కేవలం ఈ ఒక్క ఘటనే కాకుండా అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లోని అంపైరింగ్ నిర్ణయాలపై కూడా సన్‌రైజర్స్ గుర్రుగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ పట్టే సమయంలో ఫీల్డర్ ఫిల్ సాల్ట్ కాలు బౌండరీ కుషన్‌కు తగిలిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్‌ను వరుణ్ చక్రవర్తి సరిగ్గా అందుకున్నాడా లేదా అనే విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఆ సమయంలో అభిషేక్ తీవ్ర ఆగ్రహంతో మైదానాన్ని వీడటం చర్చనీయాంశమైంది. ఈ వరుస వివాదాల నేపథ్యంలో బీసీసీఐతో సంప్రదింపులు జరిపే పనిలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఉంది.