
టాప్ ఐటీ కంపెనీ.. అలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలనేది అందరి కల.. అలాంటి కంపెనీలో అతనికి పెద్ద ఉద్యోగం వచ్చింది. స్టార్టింగ్ జీతం లక్షల్లోనే ఉంది.. ఎంతో ఉత్సాహంగా ఆఫీసులో జాయిన్ అయ్యాడు. చదువుకున్నది ఎక్కడో కాదు.. IIT ఇనిస్టిట్యూట్ లో.. అలాంటిచోట చదివాడు కదా.. జీతం భారీగానే ఇచ్చింది ఈ ఐటీ కంపెనీ. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి పని లేదంట.. బోర్ కొడుతుందంట.. ఉదయం ఆఫీసుకు రావటం.. రీల్స్, యూట్యూబ్ చూసుకోవటం.. టైంకి భోజనం చేయటం.. ఆ తర్వాత మళ్లీ రీల్స్, యూట్యూబ్ చూసుకోవటం.. సాయంత్రం టైం ఇవ్వగానే ఇంటికి వెళ్లటం.. ఇదేనంట చేస్తుంది.. ఓ పెద్ద ఐటీ కంపెనీలో జాయిన్ అయిన IIT గ్రాడ్యుయేట్ సోషల్ మీడియాలో పంచుకున్న తన అనుభవం.. ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ ఐటీ ఉద్యోగి ఫీలింగ్ ఏంటీ.. దాని రియాక్షన్స్ ఏంటీ అనేది పూర్తిగా తెలుసుకుందామా….
అతను ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఉద్యోగంలో చేరినప్పటినుండి పనేమీ లేక బోర్ కొడుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంచి జీతం వస్తున్న, ఆఫీసులో చేసేందుకు ఒక్క చిన్న ప్రాజెక్ట్ కూడా లేదని, రోజంతా యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్ననని చెప్పారు. దింతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఆ ఉద్యోగి మాట్లాడుతూ.. ఉదయం ఆఫీసుకి వెళ్తాను, సీట్లో కూర్చుంటాను, ఈమెయిల్స్ చెక్ చేస్తాను. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు రీల్స్ చూడటమే నా పని. మొదట్లో ఒక GenAI ప్రాజెక్ట్ ఇస్తామన్నారు కానీ అది ఆగిపోయింది. ఆ తర్వాత ఒక టీమ్‌లోకి మార్చారు, అక్కడ కేవలం మెయింటెనెన్స్ పనులే తప్ప డెవలప్‌మెంట్ అస్సలు లేదు. స్కిల్స్ పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతానని భయమేస్తోంది.. అని చెప్పుకొచ్చాడు.
ఆ యువ ఇంజనీర్ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని హైలెట్ చేసారు. ఇది వరకు జూనియర్ డెవలపర్లు నేర్చుకోవడానికి ఉపయోగపడే చిన్న చిన్న పనులను ఇప్పుడు AI చాలా త్వరగా పూర్తి చేసేస్తోంది. దీనివల్ల కొత్తగా చేరిన వారికి నేర్చుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయా..? అన్నది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
►ALSO READ | ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపు..
అతను చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేసారు. పనేమీ లేకపోవడం నిజానికి ఒక వరం. ఆ ఖాళీ టైంలో మీకు నచ్చిన కొత్త విషయాలు నేర్చుకోండి లేదా సొంతంగా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అని కొందరు సలహా ఇచ్చారు.
జీతం వస్తోంది కదా అని ఖాళీగా కూర్చుంటే నాలుగేళ్ల తర్వాత మీ స్కిల్స్ సున్నా అవుతుంది. అప్పుడు వేరే కంపెనీకి వెళ్లడం కష్టమవుతుంది. కాబట్టి వెంటనే వేరే ఉద్యోగం చూసుకోండి అని మరికొందరు హెచ్చరించారు.
వస్తున్న జీతంతో ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ఉద్యోగం అనేది కేవలం బిల్లులు కట్టడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి అని ఇంకొందరు అన్నారు.
మొత్తానికి, పెద్ద కంపెనీల్లో పేరుకే భారీ ప్యాకేజీలు ఉంటున్నాయని, కానీ లోపల మాత్రం సరైన పని లేక చాలా మంది ప్రతిభావంతులు సతమతమవుతున్నారని ఈ ఘటన మరోసారి నిరూపించింది.