Reading Time: < 1 minute

రూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత ..ఏపీ భీమవరం కేంద్రంగా పల్లెల్లో మార్పిడి..!

Caption of Image.

నకిలీ నోట్లను చూపించి అసలు నోట్లుగా నమ్మించి అమాయకులను నిలువునా ముంచేస్తున్న  నకిలీ కరెన్సీ ముఠాను   పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ ముఠా దగ్గరి నుంచి ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన డమ్మీ కరెన్సీ నోట్లను, ఎనిమిది అసలైన 500 రూపాయల నోట్లను, అలాగే మోసానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీమవరానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ముఠా పోలీసుల చిక్కారు.

బిక్కవోలు మండలం కాపవరానికి చెందిన కొవ్వూరి గోపి చంద్ర రెడ్డి, జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహన్ సాయిలు.. శివ శంకర్‌కు ఫోన్ చేసి  లక్ష రూపాయల అసలు నోట్లు ఇస్తే, దానికి బదులుగా మూడు రెట్లు ఫేక్ కరెన్సీ ఇస్తామని నమ్మించారు. అయితే, వారి ఉచ్చులో పడని శివ శంకర్ వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.  సిఐ నాగరాజు నేతృత్వంలో పోలీసులు ప్లాన్ ప్రకారం మూడు లక్షల అసలు నోట్లు ఇస్తానని శివ శంకర్ ద్వారా నిందితులకు కబురు పంపారు. నగదు కోసం నిందితులు భీమవరం ఏఎంసీ మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకోగానే.. మాటు వేసిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, నకిలీ నోట్లను సరఫరా చేస్తున్న జంగారెడ్డిగూడెంకు చెందిన బర్రె సుధీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సీఐ నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

©️ VIL Media Pvt Ltd.