Reading Time: < 1 minute
ఏం తినకుండా పాము ఎన్ని రోజులు బతుకుతుంది..? వాటి సత్తా తెలిస్తే అవాక్కవడం పక్కా..

పాము అంటేనే భయం.. కానీ ఆ భయం వెనుక ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు పాము ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలదు? నెలల తరబడి ఏమీ తినకుండా అది ఎలా ఉంటుంది? వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. సాధారణంగా ఏ ప్రాణి అయినా ఆహారం లేకపోతే కొద్ది రోజుల్లోనే నీరసించిపోతుంది. కానీ పాములు అలా కాదు. వీటికి జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే అవి తీసుకున్న ఆహారాన్ని చాలా నెమ్మదిగా శక్తిగా మారుస్తాయి. దీనివల్ల అతి తక్కువ శక్తిని ఖర్చు చేస్తూ, ఎక్కువ కాలం ఆహారం లేకుండా ఉండగలుగుతాయి.

ఆహారం లేకుండా ఎన్ని రోజులు?

సాధారణ పాములు 10 నుండి 12 రోజుల వరకు ఆహారం లేకుండా హాయిగా ఉండగలవు. కానీ కొన్ని జాతులు, ముఖ్యంగా కొండచిలువలు, పెద్ద పాములు ఏమీ తినకుండా నెలల తరబడి, కొన్నిసార్లు ఏడాది వరకు కూడా జీవించగలవు. ఇవి ఒకసారి భారీ వేటను పట్టుకుంటే, అది అరగడానికి వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత చాలా కాలం వరకు వీటికి ఆహారం అవసరం ఉండదు.

ఆహారం కంటే తేమ ముఖ్యం

పాములకు ఆహారం దొరకకపోయినా పర్వాలేదు కానీ పరిసరాల్లో తేమ, దాక్కోవడానికి సరైన ప్రదేశం ఉండటం చాలా ముఖ్యం. వాతావరణం అనుకూలంగా ఉంటే అవి తమ శరీరంలోని శక్తిని పొదుపు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తాయి.

పాముల ఆయుష్షు ఎంత?

ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా పాము జాతులు ఉన్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో రకమైన ఆయుష్షు ఉంటుంది.

నాగుపాము : సుమారు 25 నుండి 30 ఏళ్లు జీవిస్తుంది.

కట్లపాము : 10 నుండి 15 ఏళ్ల వరకు బ్రతుకుతుంది.

వయసు పెరిగే కొద్దీ పాముల మనుగడ సాగించే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది.