
ప్రస్తుతం తనకు మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో, తన సొంత నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్న రాహువు ఈ నెల(ఏప్రిల్) 11 నుంచి అక్టోబర్ వరకు పూర్తి స్థాయి పాప గ్రహంగా వ్యవహరించే అవకావం ఉంది. ఈ నెల 11 నుంచి రాహువు ఈ రాశిలో ఒంటరిగా సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాహువు విషయంలో కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశులవారు రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రాన్ని పఠించడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది. వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్యస్వామి లేదా వినాయకుడి ఆలయానికి వెళ్లి అర్చన చేయించడం కూడా మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు కొన్ని రకాల ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలను అనుభవించాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలకు కూడా అవకాశం ఉంది. ఆదాయంలో చాలా భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలి తం తక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం, ఆస్తి వివాదంలో అన్యాయం జరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. ఆర్థికంగా నష్టపోవడం, మోసపోవడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. మిత్రులు శత్రువులుగా మారుతారు. ఇష్టమైన వ్యక్తులు దూరమవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు గురికావడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు అవకాశం ఉంది. ప్రాధాన్యం కోల్పోతారు.
- వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు సంచారం వల్ల అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించదు. పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ వృద్ధి అవకాశాలు తగ్గుతాయి. మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. నమ్మినవాళ్లు ఆర్థికంగా మోసం చేస్తారు. పిల్లల నుంచి కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అసంతృప్తి, అసమ్మతి, వాగ్వాదాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించడం అసాధ్యమవుతుంది. ప్రతి పనికి ఆటంకాలు, అవరోధాలు తప్పకపోవచ్చు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి.
- కుంభం: ఈ రాశిలో రాహువు ఒంటరి సంచారం వల్ల కుటుంబ జీవితంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్దిగా పెరుగు తాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి.
- మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు ఒంటరి సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవచ్చు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో బంధువుల జోక్యం పెరుగుతుంది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టినా నష్టపోవడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శత్రువులు పెరిగే అవకాశం ఉంది.