చాలామందికి ఉండే సందేహం ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చని. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఇంట్లో ఉంచుకునే నగదుకు నిర్దిష్ట పరిమితి లేకపోయినా, ఆ నగదు మూలంపై స్పష్టమైన ఆధారాలు ఉండటం తప్పనిసరి. నిపుణుల ప్రకారం మీ వద్ద ఉన్న నగదు జీతం, వ్యాపార ఆదాయం లేదా ఆస్తి విక్రయం ద్వారా వచ్చినదా అన్నది నిరూపించగలిగేలా బ్యాంక్ స్టేట్మెంట్లు, బిల్లులు, ఒప్పంద పత్రాలు ఉండాలి. ముఖ్యంగా, వార్షిక ఆదాయపు పన్ను రిటర్నుల్లో (ITR) చూపిన ఆదాయానికి, మీ దగ్గర ఉన్న నగదుకు పొంతన ఉండాలి.
ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడుల్లో నగదు బయటపడితే, దానికి సరైన వివరణ ఇవ్వలేకపోతే సెక్షన్ 115BBE కింద భారీ పన్నులు విధిస్తారు. ఈ సెక్షన్ ప్రకారం 60 శాతం బేసిక్ ట్యాక్స్, 25 శాతం సర్ఛార్జ్, 4 శాతం సెస్ కలిపి సుమారు 78 శాతం వరకు పన్ను విధించబడుతుంది. కొన్ని సందర్భాల్లో జరిమానాలతో ఇది 84 శాతం వరకు చేరవచ్చు.
నగదు నిల్వపై పరిమితి లేకపోయినా, నగదు లావాదేవీలపై మాత్రం కఠిన నియమాలు అమల్లో ఉన్నాయి. స్థలం లేదా ఇల్లు కొనుగోలు సమయంలో రూ.20,000కు మించిన నగదు అడ్వాన్స్ ఇవ్వడం లేదా తీసుకోవడం చట్టవిరుద్ధం. అలాగే, ఒకే రోజులో లేదా ఒకే లావాదేవీలో రూ.2 లక్షలకు మించి నగదు స్వీకరించరాదు.
బ్యాంకు లావాదేవీల విషయంలో కూడా నిబంధనలు ఉన్నాయి. ఏడాదికి రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే TDS వర్తిస్తుంది. ITR ఫైల్ చేయని వ్యక్తుల విషయంలో ఈ పరిమితి రూ.20 లక్షలకే తగ్గుతుంది.
నిపుణులు సూచిస్తున్న ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే.. నగదు ఉపసంహరణ రసీదులను భద్రపరచుకోవడం, కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి తీసుకున్న పెద్ద మొత్తాలకు లిఖితపూర్వక ఆధారాలు ఉంచుకోవడం. పెద్ద లావాదేవీలను వీలైనంత వరకు డిజిటల్ పద్ధతుల్లోనే నిర్వహించడం మంచిది.




