
- నారాయణపేట జిల్లాలో వారం కింద జరిగిన బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నారాయణపేట, వెలుగు : నారాయణపేట రూరల్ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల ఐదేండ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను నారాయణపేట ఎస్పీ వినీత్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నారాయణపేట రూరల్ మండలంలోని ఓ గ్రామంలో గత నెల 31న ఐదేండ్ల చిన్నారి చనిపోయి కనిపించింది. బాలిక మృతి అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె తండ్రి నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
బాలిక డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్‌డీపీవో నల్లపు లింగయ్య, డీసీఆర్‌బీ డీఎస్పీ ఎ.మహేశ్ పర్యవేక్షణలో ఎనిమిది స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. వివిధ ఆధారాలను పరిశీలించిన అనంతరం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బక్క చిన్న నరసింహులును నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నరసింహులు నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు నరసింహులు 2014లో ఓ యువతిపై కూడా లైంగికదాడికి పాల్పడడంతో కేసు నమోదు అయిందని, బాధితురాలికి డబ్బులు ఇచ్చి 2020లో కేసు విత్ డ్రా చేయించుకున్నట్లు ఎస్పీ వివరించారు.