
- టీజీసీసీహెచ్‌ఈకి గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన వ్యూహాలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి అన్ని వర్సిటీల వైస్ చాన్సలర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. సోమవారం లోక్ భవన్‌లో టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
వర్సిటీల ప్రస్తుత పరిస్థితి, ఉన్నత విద్యా బలోపేతానికి చేపడుతున్న సంస్కరణలపై గవర్నర్‌కు వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో సవరణలు చేస్తున్నామని, కొత్తగా ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెడుతున్నామని బాలకిష్టారెడ్డి తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అయితే, వర్సిటీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉందని, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఉన్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తాను రచించిన ‘ఫౌండేషన్స్ అండ్ ఫ్రాంటియర్స్: లా, లీగల్ ఎడ్యుకేషన్ అండ్ గ్లోబల్ ఆర్డర్’ అనే పుస్తకాన్ని గవర్నర్‌కు అందజేశారు. కాగా, రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, పారదర్శకత, బలోపేతం, సమాచార కమిషన్ కార్యకలాపాలపై గవర్నర్‌తో చర్చించారు.