Reading Time: 2 minutes

Kevin Pietersen: ఐపీఎల్ వల్ల నా కెరీర్‌ నాశనమైంది.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతోను గొడవ పడ్డాను.. 

Caption of Image.

Kevin Pietersen: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ అకస్మాత్తుగా ముగిసిన విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే తన కెరీర్‌కు ముగింపు పలికిందని ఆరోపించాడు. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన చిట్ చాట్‌లో పీటర్సన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఐపీఎల్‌లో ఆడాలనే తన నిర్ణయమే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB)తో విభేదాలకు దారితీసిందని, అ తర్వాత తన కెరీర్‌ను ముగించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2008లో ఐపీఎల్ ప్రాచుర్యం పొందుతున్న సమయంలో, ఇంగ్లాండ్ బోర్డు తమ ఆటగాళ్లను ఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతించేది కాదు.. అప్పట్లో బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా పీటర్సన్ గళం విప్పినట్లు తెలిపారు. నేను పెద్ద త్యాగమే చేశాను.. ఐపీఎల్ కోసం నా కెరీర్‌నే కోల్పోయాను.. ఆ కారణం చేతనే అప్పట్లో బోర్డులోని ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మారారు.. 33 ఏళ్లకే నా కెరీర్ ముగిసిపోయింది.. నిజానికి నేను 150 నుంచి 160 టెస్టులు ఆడి ఉండాల్సింది.. సుమారు  13 వూల వరకు పరుగులు చేయాల్సింది. కానీ బోర్డుతో విభేదాల కారణంగా అది సాధ్యం కాలేదని వెల్లడించాడు. తన టెస్ట్ కెరీర్‌లో 104 మ్యాచ్‌ల్లో 8,181 పరుగులు చేశా, ఇందులో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయని పీటర్సన్ చెప్పారు.

ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బోర్డు కొన్ని వార్తా సంస్థలను కూడా వాడుకుందని పీటర్సన్ ఆరోపించారు. ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవడం తనకు ఇష్టం లేదని, ప్రస్తుతం తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని స్పష్టం చేశారు. తను పడ్డ ఇబ్బందుల వల్లే నేడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఐపీఎల్ వంటి లీగ్‌లలో ఆడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇటీవల జోస్ బట్లర్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, అతడు నాకు ‘థాంక్యూ’ చెప్పాడని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను చేసిన పోరాటం వల్లే ఇప్పుడు తాము ఐపీఎల్ ఫలాలను అనుభవిస్తున్నారని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నారు.

ఇక కెవిన్ పీటర్సన్ 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఐపీఎల్‌లోకి అడుగు పెట్టారు. ఇంగ్లాండ్ జట్టు నుంచి తప్పించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడి తన సత్తా చాటారు. పీటర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
 

©️ VIL Media Pvt Ltd.