Reading Time: < 1 minute
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే..!

ఒకప్పుడు భారతీయ వంటగదులలో స్టవ్ శబ్దం, కిరోసిన్ వాసన నిత్యం ఉండేవి. గ్యాస్ రాకతో కిరోసిన్ మెల్లగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ప్రభుత్వం మళ్లీ తన పాత మిత్రుడిని రంగంలోకి దించుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కిరోసిన్ కేవలం రేషన్ షాపులకే పరిమితం కాకుండా, పెట్రోల్ పంపుల్లో కూడా లభించేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా సామాన్యుడి వంటగది బడ్జెట్ అదుపులో ఉండేలా ప్లాన్ చేస్తోంది.

అసలు కిరోసిన్ రంగు నీలం కాదు

మనం చిన్నప్పటి నుండి కిరోసిన్‌ను నీలి నూనె అని పిలుస్తాం. కానీ మీకు తెలుసా? స్వచ్ఛమైన కిరోసిన్ నిజానికి నీళ్లలాగే పారదర్శకంగా ఉంటుంది. దానికి సహజంగా ఎటువంటి రంగు ఉండదు. కానీ ప్రభుత్వం కావాలనే దానికి నీలి రంగు కలుపుతుంది.

నీలం రంగు ఎందుకు వేస్తారు?

దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రభుత్వం పేద ప్రజల కోసం కిరోసిన్‌పై భారీ రాయితీ ఇస్తుంది. అంటే అది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. కిరోసిన్ చౌకగా దొరుకుతుంది కాబట్టి కొందరు దానిని పెట్రోల్ లేదా డీజిల్‌లో కలిపి వాహనాల్లో వాడుతుంటారు. ఒకవేళ కిరోసిన్‌కు రంగు లేకపోతే దానిని పెట్రోల్‌లో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. అందుకే నీలి రంగు వేయడం వల్ల, అది ప్రభుత్వ రేషన్ కిరోసిన్ అని ఇట్టే దొరికిపోతుంది. ఈ రంగును సాధారణ పద్ధతుల ద్వారా నూనె నుండి వేరు చేయడం సాధ్యం కాదు.

రిఫైనరీలో కిరోసిన్ ఎలా తయారవుతుంది?

కిరోసిన్ అనేది భూమిలో దొరికే ముడి చమురు నుండి వచ్చే ఒక భాగం. దీనిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. సులభంగా చెప్పాలంటే.. ముడి చమురును భారీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు, వివిధ స్థాయిలలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆవిరి రూపంలో వేరుపడతాయి. ఇందులో కిరోసిన్‌ను ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో సేకరిస్తారు.