Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ఆమోదం

Caption of Image.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతి బిల్లు పాస్ అవడంతో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. రాష్ట్రపతి సంతకం తర్వాత కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు. 

2026, ఏప్రిల్ 2న  రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుపై చర్చకు అనుమతి ఇచ్చారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో 11 పార్టీలు నుంచి 18 మంది సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ రాజ్యసభలో కూడా బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది.

కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు రేణుకా చౌదరి(కాంగ్రెస్), నదీముల్ హక్ (టీఎంసీ), సంజయ్ సింగ్, సందీప్ కుమార్ పాఠక్ (ఆప్), నిరంజన్ బిషి (బీజేడీ), సంజయ్ యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ కుమార్ ఝా (జెడీయు), బీద మస్తాన్ రావు, సానాసతీష్ (టీడీపీ), ప్రియాంక చతుర్వేది (శివసేన), కేఆర్ సురేశ్ రెడ్డి, రవి చంద్ర వద్దిరాజు (బీఆర్ఎస్), బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, పాక వెంకట సత్యనారాయణ తదితరులు చర్చలో పాల్గొన్నారు. 

అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. తరువాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సి.పి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చను ఏపీ మంత్రి నారా లోకేష్ విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షించారు.

©️ VIL Media Pvt Ltd.