
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్, వన్ ఎలెక్షన్’, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ అంశాలపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చలు జ రుగుతూ సానుకూల పురోగతి సాధిస్తున్నామని ప్ర ధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. బీజేపీ 47వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘వన్ నేషన్, వన్ ఎలెక్షన్’ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని మోదీ పేర్కొన్నారు. అలాగే వివాహం, దత్తత వంటి అంశాల్లో మత భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేయడమే యూసీసీ లక్ష్యమని వివరించారు.
మహిళా రిజర్వేషన్ అంశాన్ని 1994 లోనే బీజేపీ ముందుకు తీసుకువచ్చిందని గుర్తుచేసిన మోదీ, ప్రస్తుతం అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల్లో అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మోదీ, ఆ పార్టీ పాలనలో ఎమర్జెన్సీ వం టి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నామని, బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా ప్రాణత్యాగాలు కూడా చేశారని పేర్కొన్నారు.