Reading Time: 2 minutes
Pcb Chief Mohsin Naqvi Crying On Ipl Psl Comparison Reality Check

PCB Chairman vs IPL: పక్కోడిపై పడి ఏడవం మరీ ఫ్యాషన్ అయిపోయింది ఆ సారుకు. ఒకసారి ఏకంగా ఒక దేశం గెలిచిన కప్పును ఎత్తుకుపోయి అబాసు పాలైన, తన బుద్ధి మాత్రం ఇంకా మార్చుకోలేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్నమైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్ర సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సారు ఈ మెగా టోర్నీపై పడి ఏడవడం ప్రారంభించాడు. ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది ఆ సారు ఎవరో అనేది. ఆయన మరెవరో కాదు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

తాజాగా పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు బహిరంగ సవాలు విసిరారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ఫ్రాంచైజీ లీగ్‌గా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పీఎస్ఎల్ 11వ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొన్న నఖ్వీ.. ఈ లీగ్ ఇప్పుడు పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారిందని పేర్కొన్నారు. పీఎస్ఎల్ 2026 ఫ్రాంచైజీ కేటాయింపు ప్రక్రియలో కనిపిస్తున్న భారీ భాగస్వామ్యం పాక్ క్రికెట్ వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని, నంబర్ వన్ స్థానాన్ని అందుకోవడం ఎంతో దూరంలో లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే నఖ్వీ చేస్తున్న ఈ వాదనలకు, క్షేత్రస్థాయిలోని గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ సుమారు $6 బిలియన్లుగా ఉంటే, పీఎస్ఎల్ విలువ కేవలం $93 మిలియన్ల వద్దే ఉంది. అలాగే ఐపీఎల్ వార్షిక ఆదాయం $1 బిలియన్ దాటగా, పీఎస్ఎల్ కేవలం $60 మిలియన్లు మాత్రమే ఆర్జిస్తోంది. ప్రపంచ క్రికెటర్ల సంఘం (WCA) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కూడా ఐపీఎల్ 62.2 పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా, పీఎస్ఎల్ 48 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ‘ది హండ్రెడ్’ (75.2) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురవ్వగా, టీమ్ హోటల్‌కు అనధికారిక అతిథులను తీసుకువచ్చి భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు షహీన్ అఫ్రిది, సికందర్ రజాలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్‌లను కేవలం రెండు వేదికలకే పరిమితం చేయడం వంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఐపీఎల్‌ను అధిగమిస్తామన్న నఖ్వీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

READ ALSO: Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!