Reading Time: < 1 minute

ఎంపీవోలుగా ఆరుగురికి ప్రమోషన్.. ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మల్టీ జోన్-–1 పరిధిలోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1, సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు మండల పంచాయతీ అధికారులుగా (ఎంపీవోలు) ప్రమోషన్ కల్పిస్తూ పీఆర్, ఆర్డీ కమిషనర్ డి.దివ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కొత్త జోనల్ విధానం ప్రకారం 2019–-20, 2020–-21 ప్యానెల్ సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన రివ్యూ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టారు. గతంలో జరిగిన ఎంపీవో ప్రమోషన్లపై ఏర్పడిన సందేహాలు, కొత్త లోకల్ క్యాడర్ అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అంతర్గత కమిటీని నియమించింది. ఈ కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ), నిబంధనల ప్రకారం అర్హులైనవారికి ప్రమోషన్లు ఖరారు చేసింది. 

నిజామాబాద్​జిల్లాలో గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతున్న ఏ.గంగాధర్, రజినీకాంత్ రెడ్డి, సయ్యద్​మగ్దమ్ అహ్మద్​ను మెదక్​ జిల్లాకు ఎంపీవోలుగా కేటాయించారు. నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పి.సాయిలును సిద్ధిపేట, సిద్ధిపేటలో గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న మునీరుద్దీన్​ను మెదక్​, వరంగల్​జిల్లాలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న షాజహాన్ ను ములుగుకు కేటాయించారు. ప్రమోషన్ పొందినవారు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కొత్త జిల్లాలో విధుల్లో చేరాలని పంచాయతీరాజ్​శాఖ ఆదేశించింది. 

ఈ నియామకాలను అడ్​హక్ ప్రాతిపదికన చేపట్టారు. కోర్టు కేసులు లేదా ఇతర పాలనాపరమైన నిర్ణయాలకు లోబడి ఈ ప్రమోషన్లు ఉంటాయని పేర్కొంది. ప్రమోషన్ పొందిన వారిని వెంటనే విధుల్లో నుంచి రిలీవ్ చేయాలని, వారు రిపోర్ట్ చేసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.
 

©️ VIL Media Pvt Ltd.