
- గ్యాస్ డెలివరీ వర్కర్స్ హెచ్చరిక
బషీర్ బాగ్, వెలుగు: తమ సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగుతామని ఎల్పీజీ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది. సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలోని 600 ఏజెన్సీల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యాలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు.
ఏండ్లుగా పనిచేస్తున్నా కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు, సదుపాయాలు కల్పించట్లేదన్నారు. పైగా అక్రమ రీఫిల్లింగ్ కోసం యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని, దీనివల్ల పోలీసులు కార్మికులపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఓటీపీ సేకరణ, కేవైసీ పనులు కూడా డెలివరీ బాయ్స్కే అప్పగించడమే కాకుండా, రోజుకు 12 గంటల పనితో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు.
ఇటీవల స్థానిక రౌడీషీటర్లు సిలిండర్లను లాక్కెళ్లే ఘటనలు పెరిగాయని, కార్మికులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్ నేతలు చామకూర రాజు, కె.వి.గౌడ్ పాల్గొన్నారు.