
ఐసిసి టి-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రపంచకప్ అంటేనే రెచ్చిపోయే ఆస్ట్రేలియాకు ఈ మెగా టోర్నీకి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అయితే ఆసీస్ అతడి స్థానాన్ని ఎవరితోనూ భర్తీ చేయలేదు. టోర్నీ మధ్యలో వచ్చి జట్టులో చేరుతాడని ఆస్ట్రేలియా భావించింది. కానీ అలా జరగలేదు.
ఈ విషయంపై టీం సెలెక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. ‘‘జోష్.. సూపర్ 8 నాటికి ఫిట్‌నెస్ పొందుతాడని ఆశించాం. కానీ, తాజా సూచనల ప్రకారం అతడు కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అతడిని ముందే ఆటకు సిద్ధం చేయడం చాలా ప్రమాదకరం. ప్రస్తుతానికైతే అతడి స్థానంలో ఎవరినీ రీప్లేస్ చేయలేదు.మేం ప్రారంభ మ్యాచ్‌లను ఇప్పుడు ఉన్న జట్టుతోనే ఆడగలమనిపిస్తోంది. అవసరమైనప్పుడు రీప్లేస్‌మెంట్ గురించి ఆలోచిస్తాం’’ అని టోనీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా నాలుగు ప్రారంభ మ్యాచులు శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె వేదికలుగా ఆడనుంది. ఫిబ్రవరి 11న తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.