
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినే త, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు సిట్ విచారణను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రంలోని అన్ని గ్రా మాలు, పట్టణాల్లో బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కదిలారని, తమకు మళ్లీ ఆనాటి ఉద్యమ రోజు లు గుర్తుకొచ్చాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. తమను తట్టిలేపిన సిఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ విచారణ కు నిరసిస్తూ స్వఛ్చందంగా నిరసనలు చేపట్టిన పార్టీ క్యాడర్‌కు ఈ సందర్భంగా కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదని, అయినా చట్టం అంటే కెసిఆర్‌కు గౌరవం అని, అందుకే సిట్ విచారణకు హాజరయ్యారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, అప్పుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సమాచారం అలాగే వచ్చిందని అన్నారు. నందినగర్ నివాసంలో సోమవారం బిఆర్‌ఎస్ ముఖ్యనేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు చెబుతున్న అబద్ధాలు ఒక్కటొక్కటి తేలిపోతున్నాయని అన్నారు. మొదట వ్యాపారవేత్తలు, ఆ తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారని, ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదని స్వయంగా కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇకనైనా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిపి సజ్జనార్ తీర్పు చెప్పడానికి ఆయన జడ్జి కాదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన అభియోగాలపై కోర్టులు తేల్చుతాయని అన్నారు. విచారణ దశలో ఉన్నప్పుడు సిపి సజ్జనార్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదని పేర్కొన్నారు.
పాలనా వైఫల్యం కనిపిస్తోంది
రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మంత్రి వాహనంపై దాడి జరగడం మొదటిసారి అని పేర్కొన్నారు. కెసిఆర్ నందినగర్ వస్తే అధికారికంగా 900 మంది పోలీసులను పెట్టారని, అనధికారికంగా 2 వేల మంది పోలీసులు ఉంటారని చెప్పారు. హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పులు, దోపిడీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. సుల్తాన్ బజార్‌లో పట్టపగలే ఎటిఎం దగ్గర చోరి జరిగిందని, నల్లమల సాగర్‌తో నీళ్ల దోపిడి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బౌన్సర్లను పెట్టుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఎవరో తెలియక కేసు పెట్టినందుకే నిజాయితీపరుడైన సిఐ హాబీబుల్లా ఖాన్ బదిలీ చేశారని ఆరోపించారు. టీవీ సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించి, పాలనపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ కేసులో హరీష్‌రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలో యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ కొనసాగుతోందని, నల్లమలసాగర్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన రావటం లేదని, తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్లనని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళారని విమర్శించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన సమాధానం లేదని అన్నారు.సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతుంటే ఎందుకు వెనక్కిపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శాఖాపరమైన కమిటీ వేసి చేతులు దులిపేసుకున్నారని, ఈ వ్యవహారంలో సృజన్‌రెడ్డి కాల్ డాటా బయటకు తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. బిఆర్‌ఎస్ నిలదీస్తుంటే దృష్టి మరల్చేందుకు సిట్‌ల పేరిట విచారణలు చేస్తున్నారని ఆరోపించారు. పైశాచిక ఆనందం కోసం కెసిఆర్‌ను అంతసేపు కూర్చోబెట్టారని, ప్రజలకు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయని తెలిపారు.
60 సార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం సాధించిందేంటి..?
కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని కెటిఆర్ విమర్శించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్‌కు నిధులు కూడా తగ్గించారని అన్నారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సున్నా అని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చేది ఇదేనా..? అని నిలదీశారు. హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారని, తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది..కాబట్టి కారిడార్ హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని తెలిపారు. తెలంగాణకు హై స్పీడ్ ట్రైన్లు ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం అని కెటిఆర్ అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని మెటీరియలైజ్ అయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేబినెట్‌లో ఉండే మంత్రి ఆ రాష్ట్ర సిఎంతో దావోస్ ఒప్పందం చేసుకున్నారని, అలాగే జూబ్లీహిల్స్‌లో ఉండే సిఎం రేవంత్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలవారీగా తమ పార్టీ నాయకత్వం అక్కడే పనిచేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తమ పార్టీ నాయకులు, కేడర్ అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. తాము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో…పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తమ నాయకుడిని విచారణ పేరిట వేధిస్తే ఊరుకుంటామా..? అని ప్రశ్నించారు. కెసిఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అస్థిత్వాన్ని ముట్టుకున్నట్టేనని బరాబర్ చెబుతున్నామని అన్నారు. తాము ఎవరికీ గులాములం కాదని తెలంగాణ ప్రజలే తమకు బాసులు అని తేల్చిచెప్పారు. కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని,ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.