
భారత రాజ్యాంగం మౌలిక లక్ష్యం ప్రజలకు సమర్థవంతమైన, న్యాయబద్ధమైన పాలనను అందించడమే. ఈ లక్ష్యసాధనలో అధికార వికేంద్రీకరణ ఒక కీలక సాధనగా రాజ్యాంగం గుర్తించింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే జిల్లాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగపరంగా అవకాశం కల్పించబడింది. అందువల్ల చిన్న జిల్లాల ఏర్పాటు అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాకుండా, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణమైన చర్యగా భావించాలి. అయితే, జిల్లాల రూపకల్పనలో భౌగోళికంగా జరిగిన లోపాలు ప్రజలకు నిరంతర ఇబ్బందులు కలిగిస్తే, అవి రాజ్యాంగపరమైన పరిశీలనకు లోబడాల్సిన అవసరం ఏర్పడుతుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వ చర్యలు యాదృచ్ఛికంగా (arbitrary) ఉండకూడదు. భౌగోళిక లోపాలతో రూపొందించిన జిల్లాల వల్ల కొందరు పౌరులు జిల్లా కేంద్రాలు, కోర్టులు, పరిపాలనా కార్యాలయాలకు చేరుకోవడానికి అధిక దూరాలు ప్రయాణించాల్సి వస్తే, అది పరిపాలనా అసమానతకు దారితీస్తుంది.
ఉదాహరణకు, కూకట్‌పల్లి మండలం, శేరిలింగంపల్లి మండలాలు భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నప్పటికీ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో వాటిని విడదీసి – కూకట్‌పల్లిని మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లాలోకి, శేరిలింగంపల్లిని రంగారెడ్డి జిల్లాలోకి చేర్చడం జరిగింది. ఈ రెండు మండలాలు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగినవే. ప్రస్తుతం న్యాయస్థానాల పరిధి పరంగా రెండూ కూకట్‌పల్లి కోర్టులోనే కొనసాగుతున్నప్పటికీ, ఇది తాత్కాలిక ఏర్పాటే.
భవిష్యత్తులో ఏ జిల్లా పరిధి ఆ జిల్లాకే చెందిన కోర్టు అనే చట్టబద్ధ సూత్రాన్ని అమలు చేస్తే, శేరిలింగంపల్లి మండలానికి సంబంధించిన న్యాయ వ్యవహారాలను రంగారెడ్డి జిల్లా పరిధిలోకి మార్చాల్సి వస్తుంది. అది అక్కడి ప్రజలకు భౌగోళికంగా మరింత దూరంగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు, శేరిలింగంపల్లి పరిధిలోనే కొత్త కోర్టు నిర్మిస్తే, పక్కపక్కనే కోర్టులు ఏర్పడే పరిస్థితి రావచ్చు. ఇది ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం మోపడంతోపాటు, ఇతర జిల్లాల ప్రజల నుంచి అసమానత ఆరోపణలకు దారి తీసే అవకాశముంది. ఈ పరిస్థితి సమాన పరిపాలనా సౌకర్యాల హక్కును భంగం చేసే అంశంగా మారుతుంది.
జీవన హక్కు – ఆర్టికల్ 21 దృక్పథం
సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 కింద జీవన హక్కును కేవలం శారీరక జీవితం వరకు పరిమితం చేయలేదు. గౌరవప్రదమైన జీవనం, సులభమైన ప్రజాసేవలు, న్యాయానికి సులభ ప్రవేశం (Access to Justice) అన్నీ దీనిలో భాగమే. పరిపాలనా సరిహద్దుల లోపాల వల్ల ప్రజలు మౌలిక సేవలు, న్యాయ వ్యవస్థను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, అది వారి జీవన హక్కుపై పరోక్ష ప్రభావం చూపినట్లుగా భావించవచ్చు. కావున భౌగోళికంగా జరిగిన పరిపాలనా తప్పిదాలను సరిదిద్దడం ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యతగా మారుతుంది.
డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ – సామాజిక న్యాయం
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 38, 39 (Directive Principles of State Policy) సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతున్నాయి. పరిపాలనా విభజనలు ప్రజలపై భారంగా మారినప్పుడు, అవి ఈ సూత్రాలకు విరుద్ధంగా మారతాయి. కాబట్టి జిల్లాల సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాకుండా, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యగా చూడాలి.
జిల్లాలు తగ్గించాలా? లేక సరిదిద్దాలా?
ఈ లోపాలకు పరిష్కారంగా జిల్లాల సంఖ్యను తగ్గించడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలం కాదు. అది అధికార వికేంద్రీకరణ లక్ష్యాన్ని బలహీనపరచి, పరిపాలనను మళ్లీ కేంద్రీకృతం చేసే ప్రమాదం కలిగి ఉంటుంది. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణలు స్థానిక స్వయంపాలనను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడ్డాయి. చిన్న జిల్లాలు ఈ వికేంద్రీకరణ భావనకు సహాయకారిగా ఉంటాయి.
అందువల్ల జిల్లాలను రద్దు చేయడం కాకుండా, భౌగోళిక లోపాలను గుర్తించి సరిదిద్దడమే సమంజసం. ఉదాహరణకు, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, బాచుపల్లి మండలాలను కలిపి ఒక కూకట్‌పల్లి సర్కిల్‌గా గుర్తించి ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం పరిపాలనా, న్యాయపరమైన దృష్టిలో సమతౌల్యమైన పరిష్కారంగా ఉంటుంది. ఇదే విషయాన్ని గతంలో కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం దృష్టికి రిప్రజెంటేషన్ ద్వారా తీసుకువెళ్లడం జరిగింది.
న్యాయస్థానాల తీర్పుల ప్రకారం ప్రభుత్వ విధాన నిర్ణయాలు సమంజసం (reasonable), ప్రజాప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలి. ప్రజలకు నిరంతర ఇబ్బందులు కలిగించే భౌగోళిక లోపాలను సరిదిద్దకుండా కొనసాగించడం అసమంజసమైన పరిపాలనగా పరిగణించబడే అవకాశం ఉంది. అందువల్ల జిల్లాల భౌగోళిక పునర్వ్యవస్థీకరణ న్యాయపరంగా కూడా సమర్థించదగిన చర్య. చిన్న జిల్లాల ఏర్పాటు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణమైనదే. అయితే వాటి రూపకల్పనలో జరిగిన భౌగోళిక తప్పిదాలను సరిదిద్దకపోతే, అదే రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది. జిల్లాలను తగ్గించడం కాకుండా, సమానత్వం, న్యాయం, ప్రజాసౌలభ్యం అనే రాజ్యాంగ సూత్రాలను ఆధారంగా చేసుకొని భౌగోళిక సవరణలు చేయడమే సరైన, రాజ్యాంగబద్ధ పరిష్కారం.
ఆర్షణపల్లి ప్రకాష్‌రావు
99484 39580