Reading Time: 3 minutes

మన తెలంగాణ / హైదరాబాద్ : తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సిఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బి. సు దర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని, ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, తెలంగాణ సమాజానికి అవమానం జరిగిందని ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేశారని, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తేనే ఏదో జరిగినట్లు రాద్దాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని, పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్లు ఉద్యమకారులు ఎలా అవుతారన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకుని హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదన్నారు. ప్రజలే తప్పు చేశారని చెప్పడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అని సిఎం ప్రశ్నించారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారని, శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారని, ఇది ప్రజాస్వామ్య యుగమని, మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు దక్కడం సముచితం

రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి దక్కడం సముచితమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తొలి తరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే, మలి తరంలో జైపాల్ రెడి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తి నింపారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. 2019 లో నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన వారు రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డి గారిని తాను కోరానని గుర్తు చేశారు. ఆ సమయంలో తరం మారింది..

ప్రత్యక్ష రాజకీయాలకు తను దూరం అని, యువతరం రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డి తనను ప్రోత్సహించారని తెలిపారు. సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనని గౌరవించిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిబద్ధత మోడీని బయపెడుతుందని ఆయనను రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిగా బరిలో దించారన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలనే ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితమని ముఖ్యమంత్రి తెలిపారు.

రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తాం

అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆయన పోరాడారన్నారు. బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని గుర్తు చేశారు. దేశంలో మొట్ట మొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారన్నారు.

ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్ట మొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారని సిఎం తెలిపారు. అరవై ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణరెడ్డి అని అన్నారు. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రావి నారాయణ రెడ్డి గారికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు. సచివాలయంలో అందరితో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం రావి నారాయణ రెడ్డి : సుదర్శన్ రెడ్డి

రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డును పొందడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని అవార్డు గ్రహిత జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు, ఎప్పటికీ ఆదర్శప్రాయుడు, తెలంగాణ స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు. సొంత ఆస్తులను ప్రజలకు పంచిన మహానుభావడని అన్నారు. తాను న్యాయవాదిగా అందుకున్న ఎన్నో అవార్డులు , గౌరవాలు ఒక ఎత్తైతే రావి నారాయణ రెడ్డి స్మారక అవార్డు ఒక ఎత్తు అని సుదర్శన్ రెడ్డి అన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం ఆస్తులనే కాదు జీవితాన్నే త్యాగం చేసిన త్యాగధనుడు నారాయణ రెడ్డి అని అన్నారు. తెలంగాణ నగ్న సత్యం పత్రికను పరిశోదిస్తే రావి నారాయణ రెడ్డి గొప్పతనం తెలుస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిశోధనలు ఎంతో అవసరమని చెప్పారు.

రాజ్యాగంపై ప్రమాణాలు చేసి విద్వేశ ప్రసంగాలతో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ఒక ముఖ్యమంత్రి ఒక వర్గం వారినుద్దేశించి ఐదు రూపాయలు ఇవ్వాల్సిన చోట నాలుగు రూపాయలు ఇవ్వాలని, సాధ్యమైతే మూడు రూపాయలు ఇవ్వాలని చెప్పడం, హేట్ స్పీచ్ ద్వారా ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అవరవీరుల ట్రస్ట్ అధ్యక్షులు చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి కె. ప్రతాప్ రెడ్డి, సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి, మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌సి ఎం. సత్యం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొ. కోదండరాం, సయ్యద్ అజీజ్ పాషా, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.