Reading Time: < 1 minute

వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది తనకు తన గుడ్ ఫ్రెండ్ మోడీకి గుడ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు. ఒప్పందం ముందుగా భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని సోమవారం వెల్లడించారు.రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేయడంలో ప్రధాని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీనితో రష్యా చమురుపై భారత్‌కు పడ్డ పాతిక శాతం ప్రతీకార సుంకాలను తగ్గించినట్లు ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక భారత్ ఎక్కువగా తమ చమురు అవసరాలను అమెరికా నుంచి , ప్రత్యేకించి తమ ఆధీనంలో ఉన్న వెనెజువెలా చమురు నిల్వల నుంచి తీర్చుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రేడ్ డీల్ కుదిరినందున పరస్పర టారీఫ్‌లు తక్షణం తగ్గుతాయని వివరించారు. భారత ప్రధాని మోడీ మంచి నాయకుడు ఎక్కువగా అమెరికా సరుకులు కొంటానని చెప్పారు.పైగా 500 బిలియన్ డాలర్ల మేర అమెరికా ఇంధన, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు దిగుతామని చెప్పారని ఈ సందర్భంగా మోడీకి ట్రంప్ కితాబు వెలువరించారు. మాట నిలబెట్టుకుంటున్నందున ఆయనకు ముందుగా ఫోన్ చేసి తరువాత సుంకాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను తాజాగా మోడీతో జరిపిన ఫోన్ సంభాషణ వివరాలను తెలిపారు. పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయని, రష్యా ఉక్రెయిన్‌ల యుద్ధం గురించి మాట్లాడామని వివరించారు. ట్రంప్ ప్రకటన తరువాత ప్రధాని మోడీ వెంటనే స్పందించారు. టారీఫ్‌ను తగ్గిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం తమకు ఆనందం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్‌నకు ధన్యవాదాలు చెపుతూ ట్వీట్ వెలువరించారు. ఆయన నిర్ణయం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని,ఆయన చేస్తున్న కృషికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.