
కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లు (మూడు హైదరాబాద్ మీదుగా వెళ్లేవి) మినహా తెలంగాణ ప్రస్తావన ఎక్కడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రం చేపట్టాలని నిర్ణయించుకున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పథకాలకు బడ్జెట్‌లో ఎలాంటి నిధుల కేటాయింపు జరగలేదు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ తదితర 47 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని నిరీక్షిస్తుండగా వీటిలో ఏ ఒక్కటీ బడ్జెట్ కేటాయింపులకు నోచుకోలేదు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐఐఎం, సిరిసిల్ల మెగా టెక్స్‌టైల్ పార్కు వంటి కీలక ప్రాజెక్టులు కూడా విస్మరణకు గురయ్యాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సామాజిక రంగాలతోపాటు వివిధ ప్రాజెక్టుల కోసం రూ. 1.5 లక్షల కోట్లను కేంద్రం నుంచి రాష్ట్రం ఆశిస్తుండగా అది నెరవేరలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంటుల రూపంలో రూ. 22,782 కోట్లు వస్తాయని ఆశించగా, ఇప్పటివరకు కేవలం రూ. 4000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
ఫార్మా రాజధానిగా హైదరాబాద్ గుర్తింపు పొందినప్పటికీ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ల తయారీ జరుగుతున్నప్పటికీ, రూ.10 వేల కోట్లతో ప్రకటించిన బయోఫార్మాశక్తి స్కీమ్‌లో తెలంగాణ పేరు లేకపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీలో ప్రత్యేకత సాధించినా, ఇసిఐఎల్ వంటి సంస్థలున్నా ఎలక్ట్రానిక్ రంగానికి రూ. 40 వేల కోట్లు కేటాయించినప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆరెంజ్ ఎకానమీ ( ఆడియో, వీడియో, గేమింగ్, కామిక్స్) రంగంలో హైదరాబాద్ ప్రపంచస్థాయి సామర్థాన్ని సాధించినప్పటికీ కేంద్రం దాన్ని ఉద్దేశపూర్వకంగానే ముంబైకి తరలించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్షం తెలంగాణపై కొనసాగుతుండడం కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలకు, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా పరిణామాలు కనిపిస్తున్నాయన్న చర్చలు మరింత ముమ్మరంగా కొనసాగే పరిస్థితి ఏర్పడవచ్చు. కేంద్రం పక్షపాత వైఖరిని తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాస్త్రంగా వినియోగించుకునే అవకాశం కలిగింది. ఇదే సమయంలో తెలంగాణను కేంద్రం విస్మరించలేదని, ఓటర్లను ఒప్పించడానికి బిజెపి శతవిధాలా ప్రయత్నించడానికి ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు.
కేంద్రం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమను ఇప్పటికే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తూర్పారపడుతూ కేంద్రానికి వ్యతిరేకంగా దాడిని ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఎంపిలు పార్టీలకు అతీతంగా సమైక్యమై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిలదీయాలని భట్టి అభ్యర్థిస్తున్నారు. బడ్జెట్‌పై పార్టీలవారీగా వేర్వేరు స్పందనలు వస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపిలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి తగిన నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం వంటి విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే బిజెపికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని వాదిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు, మూసీనది పునరుద్ధరణకు కేంద్రం మద్దతు ఇస్తుందని భరోసా ఇస్తున్నారు. విస్తృత జాతీయ స్థాయి ప్రణాళికల్లోనే తెలంగాణకు ప్రయోజనాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల పేరున నిధులు లేకపోయినా, జాతీయస్థాయిలో అప్రత్యక్షంగా తెలంగాణకు కేటాయింపులు లభిస్తాయని బిజెపి వర్గాలు నమ్మబలుకుతున్నాయి.
ఫార్మాబయోటెక్ హబ్‌గా పేరు పొందిన హైదరాబాద్‌కు బయోఫార్మా శక్తి కింద రూ. 10,000 కోట్లు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నారు. అయితే ఎంతవరకు ఈ ప్రయోజనాలు రాష్ట్రానికి లభిస్తాయో స్పష్టం చేయలేకపోతున్నారు. హైదరాబాద్‌లోను, చుట్టుపక్కల ఎంఎస్‌ఎంఇలకు, ఎంఎస్‌ఎంఇ అభివృద్ధి నిధి కింద మరో రూ. 10 వేల కోట్లు లభించవచ్చని అంచనాగా చెబుతున్నారు. కేంద్రం దేశంలో ఐదు రీజినల్ మెడికల్ హబ్స్ ప్రకటించడంపై హైదరాబాద్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. దీనివల్ల హైదరాబాద్ నగర అభివృద్ధి విస్తృతంగా జరుగుతుందని చెబుతున్నారు. జౌళి, చేనేత రంగాలకు సంబంధించి కరీంనగర్, వరంగల్, నల్గొండ వస్త్రపరిశ్రమ సముదాయాలు నిలదొక్కుకుంటాయని ఆశిస్తున్నారు.
ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలై వృత్తి కార్మికులకు మేలు జరుగుతుందని, నైపుణ్యం పెరుగుతుందని, సుస్థిరత సాధించడమవుతుందని ఆశిస్తున్నారు. వ్యవసాయ రంగానికి రూ. 1.63 లక్షల కోట్లు కేటాయించడం వల్ల వివిధ రకాల పంటల సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని, దీనికి తోడు మత్స పరిశ్రమ, పాడిపరిశ్రమ బలోపేతం అవుతాయన్న అభిప్రాయం కలుగుతోంది. ఇదిలా ఉండగా రానున్న ఏప్రిల్ 1 నుండి అమలు కానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. అధికార వికేంద్రీకరణ సూత్రం ప్రకారం 16వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో కేవలం 2.17% మాత్రమే తెలంగాణకు దక్కనుండడం మరింత క్లిష్ట సమస్యగా ఎదురుకానున్నది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ దేశంలోనే అత్యధిక ఆదాయం పన్ను చెల్లించే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, జనాభా, ఇతర అంశాల ప్రాతిపదికన కేంద్రంనుంచి వాపసు పొందే నిధులు తక్కువగా ఉన్నాయి.