
ప్రపంచ ఆర్థిక అస్థిర పరిస్థితి, దేశంలో ఆర్థిక పరిమితుల మధ్య కేంద్ర ప్రభుత్వం 2026 -27 బడ్జెట్‌ను సిద్ధం చేసింది. ఆర్థిక చర్చల్లో అనిశ్చిత పరిస్థితి ఆధిపత్యం చెలాయించింది. వాణిజ్యపరం గా ఎదురైన ఇబ్బందులు, ప్రపంచ డిమాండ్ మందగించడం, మారిన జిడిపి అంచనాలు, పన్నుల రూపంలో వచ్చే ఆదాయాలలో నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు అవకాశాలను తగ్గించాయి. ఈ సవాళ్లు మొత్తం దేశంపై ప్రభావం చూపినప్పటికీ, ఈశాన్య భారతంపై మరింత తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం చేసే వ్యయమే వృద్ధికి కీలకమైన ఈ ప్రాంతంలో ఆర్థిక అనిశ్చితి బడ్జెట్‌పరమైన ఆందోళన మాత్రమే కాదు, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదంగా మారింది.
జాతీయ ఆర్థిక నేపథ్యం సంక్లిష్టంగా ఉంది. ఆదాయం అంచనాలు, ఆర్థిక లక్ష్యాలను బలోపేతం చేసే జిడిపి వృద్ధి అంచనాలు, వినియోగం తగ్గడంతోవల్ల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నాయి. జిఎస్‌టి, ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇప్పటికీ పెరుగుతున్నా, జోరు మాత్రం తగ్గింది. అదే సమయంలో ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) నెట్‌వర్క్‌కు అనుగుణంగా రుణం- జిడిపి నిష్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతంత మాత్రంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులు, పరిమితులు, ఆర్థిక విధాన పరమైన పరిధిని మరింత తగ్గిస్తాయి.
ఈశాన్య భారతానికి సంబంధించినంత వరకూ ఈ మైక్రో -ఫైనాన్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్, తక్షణ పరిణామాలకు దారితీస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల మాదిరిగా, ఈశాన్య ప్రాంతం స్థిరమైన ప్రైవేటు మూలధన పెట్టుబడులను ఆకర్షించే స్థితి లేదు. అందుకు కారణం భౌగోళికంగా దూరం, సరైన కనెక్టివిటీ లేకపోవడం, పరిమితమైన వినియోగదారుల మార్కెట్, అడపాదడపా రాజకీయంగా, జాతిపరంగా తలెత్తే అశాంతి. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మూలధనం వ్యయం… ఇక్కడి అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఏకైక ఆర్థిక శక్తిగా మారింది. అందువల్ల కేంద్రం ఖర్చులను నియంత్రించినా, ప్రాధాన్యతలలో మార్పులు చేసినా, ఈ ప్రాంతంపై ప్రభావితం చూపుతుంది.
గత దశాబ్దంగా పలు మార్పులు వచ్చాయి. ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడులు పెట్టడంతో ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీ మెరుగుపడింది. కొత్త రహదారులు, రైల్వే లింక్ లు, వంతెనలు, విమానాశ్రయాలు, ప్రయాణ సమయాన్ని తగ్గించాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలను మరింత సులభతరం చేశాయి. ప్రభుత్వం చేసిన ఈ పెట్టుబడులకు దీటుగా, ప్రైవేటు పెట్టుబడులు రాలేదు. ఇది ప్రభుత్వ అభివృద్ధి వ్యూహాలపై ప్రభావం చూపింది. సంస్థాగతంగా, ఆర్థిక సంస్కరణలు లేకుండా ప్రభుత్వం మూలధనం ఖర్చుచేసినంత మాత్రాన ఆర్థిక స్థితిగతులను మార్చలేవు. జిడిపి, అభివృద్ధి పరమైన అంచనాలపై ఉన్న అనిశ్చిత పరిస్థితి ఈశాన్య ప్రాంతాల ప్రణాళికలను మరింత క్లిష్టతరం చేస్తుంది. క్రమబద్ధీకరించిన జిడిపి కూడా ఆర్థికపరమైన వాస్తవాలను మార్చకపోవచ్చు. కానీ అది ఆర్థిక నిష్పత్తులు, లోటు బడ్జెట్, రుణపరమైన అంచనాలపై ప్రభావం చూపించి తీరుతుంది.
కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడిన ఈ ప్రాంతానికి, అంచనాలలో స్వల్ప మార్పులు జరిగినా, నిధుల విడుదలలో జాప్యం జరిగినా, వ్యయంపై కోతలు పడినా రాష్ట్ర రుణాల సేకరణపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఇబ్బందులు అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను మరింత దిగజారుస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలకూ అడ్డంకిగా మారుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఔచిత్యం ప్రశ్నార్థకమైంది. జాతీయ స్థాయిలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌ఇలు) ప్రైవేటీకరణలో జాప్యం విపరీతమైన ఖర్చులకు దారితీస్తున్నది.
ప్రభుత్వం మూలధనం పెట్టుబడి అంతగా లాభాలు రాని లేదా నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లో చిక్కుబడిపోయి ఉంది. కాగా, మరోపక్క కొత్త ప్రాధాన్యాలకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈశాన్య ప్రాంతాలకు సంబంధించినంత వరకూ ఇది అభివృద్ధిపరమైన చిక్కుముడిగానే ఉంది. భారతదేశంలో అత్యంత క్లిష్టమైన, హానికరమైన ప్రాంతాలలో ఈశాన్య ప్రాంతం ఒకటి. వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఈ ప్రాంతం లో విపరీతం. ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. ఆర్థికపరమైన పరిమితులతో ఈ పెట్టుబడులు రిస్క్‌లో పడ్డాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలే ప్రభుత్వరంగ ఆస్తులకు నెలవుగా ఉన్నాయి. వీటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగలదు. దీంతో నిరుపయోగంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ క్షేత్రాలు జలవిద్యుత్ ప్రాజెక్టులు, తోటలు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పర్యాటకం రంగాలను సమర్థవంతంగా నిర్వహిస్తే, ఎక్కువ విలువైన ఉత్పత్తి సాధించవచ్చు. విచక్షణారహితమైన ప్రైవేటీకరణకు దూరంగా, వ్యూహాత్మకంగా, సామాజికపరంగా ప్రయోజనకరమైన విధానం ద్వారా ఆ ఉత్పత్తులను వినియోగించుకోవచ్చు.ఆ విధంగా వచ్చే ఆదాయాన్ని సాధారణ బడ్జెట్‌లో గుత్తగా కలిపేయకుండా, ప్రాంతీయ అభివృద్ధికి పారదర్శకంగా కేటాయించాలి.
ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో ఎదురవుతున్న మరో అడ్డంకి పరిమితంగా ఉన్న పన్ను రూపంలో వచ్చే ఆదాయాలు. ఈశాన్య భారతంలో తలసరి ఆదాయం తక్కువ. పరిమితమైన పారిశ్రామికీకరణ, పెద్ద ఎత్తున ఆదాయ సమీకరణకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. కేంద్రంపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ ప్రాంతంలో రాష్ట్రాలు సొంతంగా పన్నుల ద్వారా ఆదాయాలను పెంచుకోవాలని ఆశించడం దురాశే. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టులు హేతుబద్ధత దీనిని రుజువు చేస్తోంది. ఈశాన్య ప్రాంతంలో స్వల్పంగా విస్తరించిన నిధుల కారణంగా ప్రాజెక్టులు ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నాయి. 2026- 27 బడ్జెట్ పథకాలను స్థిరీకరించేందుకు, పరిమితులను తగ్గించడానికి, ఖర్చులో రాష్ట్రాలకు మరింత సౌలభ్యాన్ని కల్పించేందుకు అవకాశాన్ని అందిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఇలాంటి విధానం వల్ల ఆయా ప్రభుత్వాలు వ్యయం విషయంలో తమ తమ ప్రాధాన్యాలను నిర్ణయించుకునేందుకు అనుమతినిస్తుంది. ఫలితంగా ఉద్యానవనం పంటలు, మత్స్య సంపద, వెదురు ఆధారిత పరిశ్రమలు, చేనేత, హస్తకళలు, పర్యావరణ పర్యాటకం వంటి రంగాల విస్తరణకు వీలవుతుంది.
ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో రుణాల లభ్యత నిస్సారంగా ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, గిరిజన సహకార సంస్థలకు కూడా రుణాలు లభించడం కష్టంగానే ఉంది. ప్రభుత్వరంగ సంస్థలే ఈ ప్రాంతంలో ఆర్థికరంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రిస్క్ తీసుకోడానికి వెనుకాడడం, శాఖ స్థాయిలో స్వయం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో రుణాలు పరిమితంగానే ఇస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ల కోసం ఒత్తిడి తేవకుండా, క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచువచ్చు. క్రెడిట్ హామీలు, విధానపరమైన చర్యలు ఈ పరిస్థితిని మార్చగలవు.
ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధిని సామాజిక స్థిరత్వం నుంచి విడదీయలేము. దీర్ఘకాలం పాటు సాగిన జాతి సంఘర్షణలు, వలసలు, పాలనాపరమైన సవాళ్లు, మార్కెట్‌కు అంతరాయం కలిగిస్తుండడంవల్ల పెట్టుబడులు తగ్గుతున్నాయి. సంస్థలు నమ్మకం కోల్పోతున్నాయి. జాతీయంగా జిడిపిలో వైద్య, ఆరోగ్య రంగాలకు, విద్యపైన చేసే వ్యయం మరీ హీనంగా ఉంది. ఇది దశాబ్దాలుగా నెలకొన్న ప్రాంతీయ అసమానతలు పరిష్కరించే అవకాశాలను తగ్గిస్తున్నది. అందువల్ల, 2026 -27 బడ్జెట్ ఖర్చుల పరిమాణాన్ని మాత్రమేకాక, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈశాన్య రాష్ట్రాలకు, వాతావరణ షాక్‌లను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, చిన్నరైతులకు మద్దతు ఇచ్చే, ఈ వాతావరణ అనుకూల వ్యవసాయం, స్థానిక అవసరాలకు అనుగుణంగా మూలపెట్టుబడి పెట్టడం అవసరం. ఇందుకు ప్రభుత్వ సంస్థల విశ్వసనీయతను పునరుద్ధరించడం అవసరం. ఈశాన్య భారతానికి వివేకం, సమగ్రమైన, సమతుల్య వృద్ధి వ్యూహాం ఉండాలి. పథకాల హేతబద్ధీకరణ, ఎక్కువ సౌలభ్యంతో రాష్ట్రాలకు అవకాశం కల్పించడం, ఆర్థిక పరిమితులను సంస్కరణలకు అవకాశంగా మార్చగలవు, 2026- 27 బడ్జెట్ ఈ సవాల్‌ను ఎదుర్కొంటే ఈశాన్య ప్రాంతం జాతీయ ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ, సమతుల్యంతో కూడిన అభివృద్ధి నమూనాగా ఉద్భవిస్తుంది.
చివరి వాక్యం. ఈశాన్యానికి అతిపెద్ద ప్రమాదం అనిశ్చితి కాదు. జడత్వం. ప్రాంతీయ ఆకాంక్షలు, సామాజిక సమైక్యతను దెబ్బ తీసి ఆర్థిక ఏకీకరణ జరగకుండా చూసుకోవడానికి నిర్ణయాత్మక, ప్రాంతీయపరమైన సున్నితమైన, విధానపరమైన చర్య తీసుకోవడమే ఏకైక మార్గం.
గీతార్థ పాఠక్