
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కేరళకు చెందిన ఎంపి తమ కృత్రిమ కాళ్లను ప్రదర్శించడం సంచలనానికి దారితీసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ దశలో ఈ సభ్యుడు సదానందన్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో సిపిఎం సభ్యులు మండిపడ్డారు. ఆయనను అడ్డుకున్నారు. సభ్యుడి తీరుపై సిపిఎం ఎంపిలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఇంతకు ముందు స్కూల్ టీచర్‌గా ఉండి, తరువాత రాజకీయాల్లోకి వచ్చిన మాస్టర్ సదానందన్ తమ ప్రసంగంలో మూడు దశాబ్దాల క్రితం తనపై కేరళలో సిపిఎం కార్యకర్తలు జరిపిన దాడిని ప్రస్తావించారు. తాను ఇంటికి వెళ్లుతుండగా తనపై సిపిఎం వారు దాడికి దిగి, కిందపడేసి కాళ్లు నరికేశారని, ఇప్పుడు కృత్రిమ కాళ్లతో తిరుగుతున్నానని, వాటిని చూపారు. దేశం ఈ ప్రజలకు కేరళలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిందనేది తెలియాల్సి ఉందని చెప్పారు.
31 సంవత్సరాల క్రితం తనపై దాడి జరిగిన విషయం అంతా గుర్తించాలని, ప్రజాస్వామ్యం గురించి నినాదాలకు దిగేవారి అసలు స్వరూపం తనతోనే తెలిసి తీరాలని చెప్పారు. దీనికి సిపిఎం అడ్డుతగిలింది. తాను నిలబడలేకపోతున్నానని, కూర్చుని మాట్లాడుతున్నానని తెలిపారు. టేబుల్‌పై తన ఊతపు కాళ్ల జతను ఉంచారు. వీటిని చూసి, కేరళలో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని కోరారు. దీనిపై సిపిఎం నేత జాన్ బ్రిట్టాస్ స్పందించారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభలో ఇతర వస్తువులు ప్రదర్శించడం సభా వ్యతిరేకమని నిబంధనలు చెపుతున్నాయి. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని బ్రిట్టాస్ విమర్శించారు. దీనితో ఆయనకు, బిజెపి నామినేటెడ్ ఎంపికి మధ్య వ్యాగ్యుద్ధం సాగింది. ఈ దశలో సభాధ్యక్షులు సిపి రాధాకృష్ణన్ కలుగచేసుకుని సభ్యులు ఎవరైనా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలిగించాల్సి ఉందని రాజ్యసభ నేత జెపి నడ్డా డిమాండ్ చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కేరళలో అధికార వామపక్ష దౌర్జన్యాల విషయం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ దశలో బిజెపి ప్రస్తావనకు తీసుకువచ్చింది.