Reading Time: < 1 minute

 కుక్కల బెడదను అరికట్టలేని రాష్ట్రాలపై భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీం కోర్టు మంగళవారం హెచ్చరించింది. వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతికుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవిత కాలం ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. “ ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే , అప్పుడు ఆ ప్రాణనష్టానికి ఆ సంస్థ బాధ్యత వహించదా ? అని ప్రశ్నించింది. అందుకనే వీధి కుక్కల బెడదను నివారించడానికి రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలి.

లేదంటే ప్రతి కుక్క కాటుకు , కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గానూ ఆయా రాష్ట్రాలపై మేం నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలి ”అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారి గురించి మాట్లాడుతూ “ మీకు శునకాలపై అంత ప్రేమ ఉంటే, వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని అంటున్నారు. మీ భావోద్వేగం కేవలం కుక్కల పైన మాత్రమేనా ? మేం మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నాం. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేం ఆమోదించబోం ” అని ధర్మాసనం వెల్లడించింది.