
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ కార్యక్రమంలో కాల్పుల ఘటనతో అగ్ర రాజ్యం అమెరికా ఉల్కిక్కిపడింది. ఈ ఊహించని పరిణామంతో భద్రతా దళాలు హై అలర్ట్ అయ్యాయి. నిమిషాల్లోనే హొటల్ ను అదుపులోకి తీసుకుని కాల్పులు జరిపిన దుండగుడిని భద్రత దళాలు వెంటాడి పట్టుకున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న షూటర్ ఫొటోను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో నిందితుడిని చొక్కా లేకుండా, చేతులు కట్టేసి నేలపై బొర్లా పడుకోబెట్టాయి భద్రతా దళాలు. నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్న భద్రతా దళాలను ట్రంప్ ప్రశంసించారు.
అసలేం జరిగిందంటే..?
శనివారం (ఏప్రిల్ 25) వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్కు ప్రెసిడెంట్ ట్రంప్ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సహా సుమారు 2,600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిన్నర్ మీట్ కొనసాగుతుండగా ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్ధం తీవ్ర కలకలం రేపింది.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‌ను అత్యవసరంగా హోటల్ నుంచి బయటకు తరలించారు. కాల్పుల శబ్ధంతో భయాందోళనకు గురైన గెస్ట్‌లు టేబుళ్ల కింద దాక్కుకున్నారు. ఘటన స్థలంలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు హోటల్‌ను ఆధీనంలోకి తీసుకున్నాయి.
కాల్పులు జరిపిన నిందితుడిని సెక్యూరిటీ ఫోర్సెస్ చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినట్టు గుర్తించారు. ట్రంప్ సహా కీలక నేతలు అంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
భద్రతా సిబ్బంది తీరు అద్భుతం: ట్రంప్
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కలకలం రేపిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లా్ట్ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. సీఐఏ ఏజెంట్స్, పోలీస్ విభాగం అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. కాల్పుల సమయంలో భద్రతా సిబ్బంది చాలా వేగంగా, ధైర్యంగా స్పందించారన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు.