Reading Time: 2 minutes

డిజిటల్ పేమెంట్స్ కొత్త రూల్స్: డెబిట్ క్రెడిట్ కార్డులు మారినా ఆటో-పేమెంట్స్ ఆగవు

Caption of Image.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్, మ్యూచువల్ ఫండ్స్ SIP, ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించే వారికి అదిరిపోయే తీపి కబురు తెచ్చింది. డిజిటల్ పేమెంట్స్ ఈ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ 2026 పేరుతో కొత్త రూల్స్ విడుదల చేసింది. దీంతో మీ జేబుకు చిల్లు పడకుండా.. పాత తలనొప్పులు లేకుండా ఆటో-డెబిట్ ప్రక్రియను మరింతగా సులభతరం చేసింది.

కార్డు మారినా పేమెంట్ ఆగదు
సాధారణంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు గడువు ముగిసినా లేదా పోగొట్టుకున్నా.. కొత్త కార్డు వచ్చినప్పుడు పాత దానికి అటాచ్ అయిన ఆటో-పేమెంట్స్ అన్నీ ఆగిపోయేవి. మళ్లీ కొత్తగా పిన్ సెట్ చేయడం, మ్యాపింగ్ చేయడంతో పెద్ద పనే ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం.. మీ కార్డు మారినా మీ పాత ఈ-మాండేట్ ఆటోమేటిక్‌గా కొత్త కార్డుకు లింక్ అవుతుంది. దీనివల్ల మీ SIPలు లేదా బిల్లు చెల్లింపులకు ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూ అవుతాయి.

అదనపు ఛార్జీలకు చెక్
ఆటో-డెబిట్ సదుపాయాన్ని వాడుకుంటున్నందుకు కొన్ని బ్యాంకులు లేదా పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు గతంలో చిన్నపాటి ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించేవి. అయితే రిజర్వు బ్యాంక్ ఇప్పుడు దీనిపై కఠిన నిర్ణయం తీసుకుంది. రికరింగ్ పేమెంట్స్ కోసం ఈ-మాండేట్ సదుపాయాన్ని వాడుకుంటే కస్టమర్ల నుంచి ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జీల రూపంలో వసూలు చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇకపై మీరు ఆటో-పే పూర్తిగా ఉచితంగా పొందుతారన్నమాట.

ALSO READ : ఏప్రిల్ డిస్కౌంట్స్ ధమాకా

పెరిగిన లిమిట్స్.. ఎక్స్‌ట్రా సేఫ్టీ
సాధారణంగా రూ.15వేల లోపు పేమెంట్లకు ఎటువంటి OTP అవసరం లేదు. అంతకు మించితే అథెంటికేషన్ తప్పనిసరిగా ఉండేది. అయితే ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలో ఈ పరిమితిని ఏకంగా రూ.లక్ష వరకు ప్రస్తుతం పెంచింది ఆర్బీఐ. అంటే లక్ష రూపాయల వరకు పేమెంట్లు ఎటువంటి ఓటీపీ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.

ఫిర్యాదు చేయడం ఇక సులభం..
మీ పర్మిషన్ లేకుండా డబ్బులు కట్ అయినా లేదా ఆటో-డెబిట్‌లో ఏవైనా పొరపాట్లు జరిగినా కంప్లెయింట్ చేసే ప్రక్రియను ఆర్‌బీఐ మరింత పటిష్టం చేసింది. ప్రతి పేమెంట్ అలర్ట్ మెసేజ్‌లో ఫిర్యాదు ఎలా చేయాలో లింక్ ఇవ్వడం తప్పనిసరి చేసింది ఇకపై. అనధికారిక లావాదేవీలు జరిగితే కస్టమర్లకు పూర్తి రక్షణ కల్పిస్తూ జవాబుదారీతనాన్ని పెంచింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.