
Haryana Viral Video: మమ్మీ.. మమ్మీ.. అంటూ ఓ మహిళ రోడ్డుపై కేకలు వేస్తోంది. చుట్టూ జనం ఉన్నా.. ఆమెను కాపాడేలోపే భర్త దారుణంగా కొడుతున్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తూ, కింద పడేసి లాఠీలా చేతులు కాళ్లతో దాడి చేస్తున్నాడు. తప్పించుకునేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా వదలకుండా చేతిని మెలిపెట్టి హింసిస్తున్నాడు. హర్యానాలోని రేవారి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 27 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన రేవారి జిల్లా బావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో భర్త తన భార్యను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా కొట్టడం కనిపిస్తోంది. మహిళ ప్రాణభయంతో మమ్మీ.. మమ్మీ.. అంటూ పదేపదే అరుస్తున్నా అతడు ఆగలేదు. ఆమె జుట్టు పట్టుకుని లాగడంతో పాటు చేతిని మెలిపెట్టాడు. చివరకు మహిళ కేకలు విని అక్కడికి చేరుకున్న పొరుగువారు జోక్యం చేసుకుని ఆమెను భర్త నుంచి విడిపించారు.
అయితే ఈ ఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్యపై దాడి చేసిన భర్తే ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమెపై ఫిర్యాదు చేశాడు. ఘటన తర్వాత అతడు ఆసుపత్రికి వెళ్లి తన భార్య లాఠీతో కొట్టిందని చెప్పాడు. దీంతో అతడిని ట్రామా సెంటర్‌లో చేర్చి చికిత్స అందించారు. అక్కడ మెడికో లీగల్ రిపోర్ట్ అంటే ఎంఎల్ఆర్ కూడా నమోదు చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు భార్యపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
జూలై 19న భర్త బావల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య తనను చంపేస్తానని బెదిరిస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. భార్య సమయానికి భోజనం కూడా పెట్టడం లేదని, ప్రతి విషయానికీ గొడవ పడుతుందని, కొంతకాలంగా తనపై దాడి కూడా చేస్తోందని అతడు ఆరోపించాడు. తనకు ఆమె వల్ల ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పాడు.
మరోవైపు భార్య మాత్రం భిన్నమైన వాదన వినిపించింది. తన భర్తకు ఎలాంటి పని లేదని, మద్యం తాగి ఇంటికి వచ్చి తరచూ గొడవ పడతాడని ఆరోపించింది. తాను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంటి ఖర్చులతో పాటు ముగ్గురు పిల్లల చదువుల బాధ్యతను కూడా చూసుకుంటున్నానని చెప్పింది. ఇంత బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త తనపై తరచూ దాడి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను కూడా భార్యే బయటకు తీసుకొచ్చింది. కేవలం 27 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆమెను భర్త రోడ్డుపై పడేసి కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం, చేతిని మెలిపెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ సహాయం కోసం కేకలు వేస్తున్న సమయంలోనూ దాడి కొనసాగింది. చివరకు కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఒకవైపు భార్యపై భర్త ఫిర్యాదు చేయడం, మరోవైపు తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భార్య బయటపెట్టడం ఇప్పుడు ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చింది. గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ఇరువైపుల ఫిర్యాదులు, వైద్య నివేదికలు, వీడియో ఆధారాలను పోలీసులు ఎలా పరిశీలిస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.