
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని లగ్జరీ కమ్యూనిటీల్లో నివసించే ఐటీ ఉద్యోగులు, సంపన్న కుటుంబాల బిజీ లైఫ్ స్టైల్ కారణంగా గృహ కార్మికులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాల వారిని, నేపాల్నుంచి వలస వచ్చిన వారిని వాచ్మెన్లుగా, వంటవాళ్లుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా నియమించుకునేవారు.
ఇటీవలి కాలంలో పలు ఇండ్లలో యజమానులను చంపి, ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తున్న ఉదంతాలు పెరగడంతో వారి స్థానంలో తెలంగాణ, ఏపీవారికే యజమానులు మొదటి ప్రాధన్యమిస్తున్నారు.
జీతం ఎక్కువైనా ఫర్వాలేదంటూ స్థానికులను, నమ్మకస్థులనే నియమించుకుంటున్నారు. ఈ క్రమంలో పల్లెల్లో ఉపాధిలేక పస్తులుండే బదులు పట్నంలో ఏదో ఒక పనిచూసుకొని పిల్లల్ని చదివించాలనే ఆలోచనతో ఒకరిని చూసి ఒకరు వందలు, వేల కుటుంబాలు సిటీ బాటపడ్తున్నాయి.
నాలా ఎంతో మంది మహిళలు పనిచేస్తున్నరు
నా పేరు మౌనిక, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మాది హన్మకొండ జిల్లా హసన్‌పర్తి గ్రామం. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఊరిలో పనులు దొరక్క హైదరాబాద్ వచ్చి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో లేడీ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేసే మహిళలను చెక్ చేసి ఆఫీస్ లోపలికి పంపించడమే నా పని.
రోజుకు 8 గంటలు డ్యూటీ. నీడ పట్టున ఉండొచ్చు. నెలకు రూ.20 వేలకు పైగా జీతం ఇస్తారు. పీఎఫ్ కూడా కట్ అవుతుంది. ఈ జీతం డబ్బులతో నా ఇద్దరు కూతుర్లను చదివించుకుంటున్నాను. మన రాష్ట్రానికే చెందిన ఎందరో మహిళలు ఇక్కడ నాలాగే అనేక కంపెనీలలో పనిచేస్తున్నారు.
లోకల్ వాళ్లనే నమ్ముతున్నారు
నా పేరు రాజేందర్, వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామం. నేను పదో తరగతి పాస్ అయ్యాను. ఊరిలో పనులు దొరకడం లేదు. దీంతో నా భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఓ ట్రాలీ ఆటో నడుపుతున్నాను. నా భార్య కూడా ఇక్కడే ఓ హైరైజ్ బిల్డింగ్లో ఉద్యోగం చేస్తున్నది.
ఇద్దరం కలిసి నెలకు రూ.40 వేలకు పైగా సంపాదిస్తున్నాం. నా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఓ ప్రైవేట్ బడిలో చదువుకుంటున్నారు. హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో లోకల్ వాళ్లనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇక్కడ ఉద్యోగం, ఉపాధికి ఎలాంటి ఢోకా లేదు.