Reading Time: 2 minutes

గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత.. బేస్‌బాల్ మ్యాచ్‌ చూస్తూనే

Caption of Image.

అమెరికన్ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు, మాజీ కాంగ్రెస్ సభ్యుడు బెన్ జోన్స్ (84) కన్నుమూశారు. CBS ఛానల్ లో ప్రసారమైన ప్రముఖ యాక్షన్-కామెడీ సిరీస్ ‘ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్’ (The Dukes of Hazzard)లో ‘కూటర్ డేవెన్‌పోర్ట్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన.. నటుడిగానే కాకుండా రచయితగా, రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 30న జన్మించిన ఆయన.. 2026 ఆగస్టు 9న తుదిశ్వాస విడిచారని హాలీవుడ్ సినీవర్గాలు వెల్లడించాయి. 

గుండెపోటుతో మృతి..

నటుడు బెన్ జోన్స్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెన్ జోన్స్ తన నివాసంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురై మరణించారని వెల్లడించారు. అట్లాంటా బ్రేవ్స్, న్యూయార్క్ యాంకీస్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్‌ను తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చొని చూస్తుండగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భార్య ఎమోషనల్ పోస్ట్..

బెన్ జోన్స్ మృతిని ఆయన భార్య అల్మా వియాటర్ (Alma Viator) సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. తన భర్తను కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని పేర్కొంటూ భావోద్వేగ నివాళి అర్పించారు. బెన్ జోన్స్ ఎంతో సంపన్నమైన, ఆనందభరితమైన జీవితాన్ని గడిపారని.. ఆయన ఎంతోమందిని ప్రేమించారని, అదే విధంగా ఎంతోమంది ఆయనను ప్రేమించారని ఆమె పేర్కొన్నారు. ఆయన లేని లోటు తమ కుటుంబానికి ఎప్పటికీ తీరనిదని తెలిపారు.

‘ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్’తో భారీ గుర్తింపు.. 

1979 నుంచి 1985 వరకు ప్రసారమైన ‘ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్’ సిరీస్‌లో బెన్ జోన్స్ ‘కూటర్ డేవెన్‌పోర్ట్’ పాత్రలో నటించారు. ఈ సిరీస్‌లోని మొత్తం 141 ఎపిసోడ్లలో ఆయన కనిపించి టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. నటనతో పాటు ఆయన నాటక రచయితగా, వ్యాసకర్తగా కూడా పనిచేశారు. 2021లో విడుదలైన ‘అన్‌బ్రేకబుల్’ ఆయన నటించిన చివరి చిత్రంగా నిలిచింది.

రాజకీయాల్లోనూ రాణించిన బెన్ జోన్స్..

నటన రంగంలో కొనసాగుతూనే బెన్ జోన్స్ రాజకీయాల్లోనూ రాణించాడు. డెమోక్రటిక్ పార్టీ తరఫున జార్జియా రాష్ట్రం నుంచి 1988, 1990 ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి 1993 వరకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ సభ్యుడిగా సేవలందించారు.

నటుడిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన బెన్ జోన్స్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం అమెరికన్ టెలివిజన్ రంగానికి, ఆయన అభిమానులకు తీరని లోటుగా మిగిలింది.

©️ VIL Media Pvt Ltd.