Reading Time: < 1 minute
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదు బ్యాగ్‌తోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

మేడ్చల్ జిల్లాలోని ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకుని ప్రయాణికుల ప్రశంసలు అందుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికుడు పొరపాటున మరిచిపోయిన విలువైన ల్యాప్‌టాప్, భారీ నగదు ఉన్న బ్యాగ్‌ను క్షేమంగా బాధితుడికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేడ్చల్ డిపోకు చెందిన కండక్టర్, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి లక్షలాది రూపాయల విలువైన సొత్తును బాధితుడికి తిరిగి చేర్చారు.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఆగస్టు 8 మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్ నంబర్ గల బస్సు పటాన్‌చెరువు నుంచి సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో కేపీహెచ్‌బీ వద్ద ప్రశాంత్ అనే ప్రయాణికుడు ఒక బ్యాగ్‌తో బస్సు ఎక్కి, రాత్రి 1:15 గంటల సమయంలో ప్యాట్నీ వద్ద దిగిపోయారు. ఆ తొందరలో తన విలువైన బ్యాగ్‌ను సీట్లోనే మరిచిపోయారు. బస్సు తిరుగు ప్రయాణంలో ఉండగా పరిశీలించిన కండక్టర్ గోవింద్ ఆ సీట్లో ఉన్న బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే డ్రైవర్ ఇస్మాయిల్ సహాయంతో విషయాన్ని డిపో అసిస్టెంట్ మేనేజర్ రామారావుతో పాటు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అధికారుల సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో సుమారు రూ. 2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్, రెండు పర్సులు, చార్జర్, దుస్తులు, ఆఫీస్ ఐడీ కార్డు ఉన్నట్లు గుర్తించారు. ఐడీ కార్డు, ఇతర పత్రాల ఆధారంగా లభించిన కాంటాక్ట్ నంబర్ ద్వారా బాధితుడు ప్రశాంత్‌ను అధికారులు సంప్రదించారు. అనంతరం ఆయనను డిపోకు పిలిపించి, వస్తువులన్నింటినీ సరి చూసుకున్న తర్వాత బ్యాగ్‌ను భద్రంగా అప్పగించారు. పోయిందనుకున్న తన విలువైన సొత్తు, నగదు తిరిగి దక్కడంతో ప్రయాణికుడు ప్రశాంత్ ఆనందం వ్యక్తం చేస్తూ.. కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఇస్మాయిల్, డిపో అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.