
నీతి నిజాయితీలతో కూడిన విలువలు కలిగిన సీహెచ్ రాజేశ్వర్ రావు, నర్సింగరావు ఆధ్వర్యంలో నెలకొల్పిన సెస్ ప్రతిష్ట తదనంతరం వచ్చిన పాలక వర్గాల పుణ్యమా అని మసకబారింది. సెస్ వినియోగదారులకు కావాల్సింది అత్యుత్తమ విద్యుత్ సేవలు మాత్రమే. అది ఎన్పీడీసీఎల్ అయినా, సెస్ అయినా మూడు లక్షల మంది వినియోగదారులకు వెలుతురునిచ్చే రెండు కండ్ల వెలుగు కావాలి. సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)కు సహకార రంగంలో 56 ఏండ్ల చరిత్ర ఉంది. ఇటీవల పాలకవర్గాల అక్రమాల చీడపీడల వలన సంస్థ అనేక దర్యాప్తులలో చిక్కుకున్నది.
ఈ సంస్థలో గత రాష్ట్ర్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, సంస్థ సభ్యుడు అయిన రంగారావు 26.02.2024 నాడు తన లేఖ ద్వారా ఎన్పీడీసీఎల్, సెస్ విలీనం చేయాలని సిఫారసు చేశారు. అనేక కారణాల వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్సన్ ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ 2007 నుంచి 2011 మధ్య సంస్థలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరారు. అప్పటి నుంచి సదరు విజిలెన్స్ వారు ఎన్నోమార్లు లేఖలు రాసినా, సెస్‌కు సంబంధించిన రికార్డులు సమర్పించమని కోరినా, పాలకవర్గాలు అలసత్వం వహించాయి.
అగ్నిప్రమాదం
2022 చిట్టచివరికి విజిలెన్స్ అధికారి 2007–2011 మధ్య సంస్థ లావాదేవీలను సమర్పించమని కోరారు. ఇదిలా ఉండగా 56 ఏండ్ల సంస్థలో ఎన్నడూ దీపావళికి టపాసులు కాల్చినా ఎటువంటి అగ్నిప్రమాదాలు జరగలేదు. కానీ, 2023 దీపావళి సందర్బంగా పేల్చిన టపాసుల వలన సెస్‌పై అంతస్తులో ఉన్న పర్చేజ్ గదిలో మంటలు వ్యాపించి అందులో ఉన్న ఫైల్స్, ఇతర కంప్యూటర్ పరికరాలు కాలిబూడిదయ్యాయి.
దీనిమీద పలు అనుమానాలు ఇప్పటికీ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తు నత్తనడకన నడుస్తోంది. మరోవైపు సంస్థ చైర్మన్ సహకార సంఘం చట్టం 116 సీ సెక్షన్ ప్రకారం చైర్మన్ పారితోషికం ఇతర సౌకర్యాలు, అలవెన్సులు తీసుకోవాలని ఉన్నప్పటికీ సంస్థ చైర్మన్ తన పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతినెల తీసుకుంటున్నారు. సంస్థ డైరెక్టర్లు నెలనెలా సమావేశ సిట్టింగ్ ఫీజులను అమాంతం రూ.5వేలు పెంచుకుని తీసుకుంటున్నారు. ఇటువంటి అక్రమాలు సంస్థలో జరుగుతున్నప్పటికీ దానికి అధికార పార్టీ నాయకులు నిమ్మకు నీరెత్తిన్నట్లు చూస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.
సహకార రంగంలో సెస్ ఏకైక సంస్థ
భారతదేశంలోనే ప్రథమంగా 5 సహకార సంఘాలను వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సహకార రంగంలో ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన సెస్ ఒకటి. ఆ మాటకు వస్తే తెలంగాణలో ఏకైక సంస్థ. ఆశ్చర్యకరంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో స్థానిక శాసన సభ్యుడు, మంత్రి 2014 నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలను ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దానికి తోడు సంస్థలో పవర్లూమ్స్ కుటీర పరిశ్రమ 5 హెచ్ పీ వరకు కుటీర పరిశ్రమల కింద ఉండేది. అది క్రమంగా టెన్ హెచ్‌పీగా మారింది. సంస్థ పాలక వర్గం, సాంకేతిక సిబ్బంది ఎన్ని హెచ్పీలు వాడుకున్నా సుమారు 150 సర్వీసుల వరకు కుటీర పరిశ్రమ కింద మంజూరు చేశారు.
ఈఆర్సీ నియామాకం చేసిన ఆడిటర్ సంస్థలో జరిగిన ఆడిటింగ్‌లో బిల్లింగ్ విషయంలో అక్రమాలను ఎత్తిచూపారు. అనేక అంశాలతోపాటు సంస్థ పర్చేజ్ విభాగం ఎక్స్పెండిచర్ విభాగంలో రికార్డులు అందుబాటులో లేవని ఈఆర్సీకి 18 అంశాలతో కూడిన నివేదిక సమర్పించారు. కానీ, పాలకవర్గం పైపై చర్యలు తీసుకొని సెస్‌లో జరిగిన ప్రధానమైన ఆడిటర్ ఎత్తిచూపిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నివేదిక ఆధారంగా అప్పటి ఈఆర్సీ చైర్మన్ సంస్థను ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలని సిఫార్స్ చేశారు. ఇది 2024 ఫిబ్రవరిలో రాసిన లేఖ. సదరు పాలకవర్గానికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఎన్పీడీసీఎల్ సంస్థ విలీనానికి మార్గం సుగమమైనది.
మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి
సెస్ లైసెన్స్ కోసం ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ లైసెన్స్ రెన్యువల్ చేయలేదు. 31.03.2020 వరకు సంస్థ లైసెన్స్ గడువు కాలం పూర్తి కావడంతో ఈఆర్సీ సూచన మేరకు ఎన్పీడీసీఎల్ సెస్ పరిధిలో వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు ఏప్రిల్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంస్థ పాలకవర్గం హైకోర్టులో కేసు వేశారు. కానీ, ఇటీవల సెస్‌కు లైసెన్స్ రెన్యువల్ చేయలేమని లేఖ ద్వారా ఈఆర్సీకి తెలిపారు.
మరోవైపు ఎన్పీడీసీఎల్ సంస్థను సెస్‌కు లైసెన్స్ గురించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వారు సెస్ పరిధిలో విద్యుత్ నియంత్రణ మండలికి సెస్ లైసెన్స్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా జరుగుతుంటే సంస్థ చైర్మన్, పాలకవర్గ సభ్యులు సెస్‌ను కొనసాగిస్తే తాము ఎమీ ఎరగన్నట్లు మేకపోతు గాంభీర్యం వహించి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పడం కొసమెరుపు. వినియోగదారులకు కావాల్సింది అత్యుత్తమ విద్యుత్ సరఫరా సేవలు. ఆ సేవలు సెస్ అయినా ఎన్పీడీసీఎల్ అయినా కావాల్సింది మెరుగైన విద్యుత్ సేవలు మాత్రమే.
జూకంటి జగన్నాథం
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.