Reading Time: 3 minutes

వెలుగు ఓపెన్ పేజీ.. మహిళా రిజర్వేషన్..ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

Caption of Image.

భారతదేశంలో  స్త్రీ అంటే ఇతిహాసాల్లో  వీరనారి,  ఇంట్లో లక్ష్మి, ధైర్యంలో దుర్గ,  పుట్టుకతోనే   దేవతగా కొలుస్తాం. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః  అని శ్లోకాలు చదువుతాం. కానీ, ఈ దేవతల స్థానం ఎక్కడ? గడప దాటితే భయం, చట్టసభల్లోకి  వెళ్లేందుకు అడ్డంకులు!   మనం స్వాతంత్య్రం పొంది ఎనిమిది దశాబ్దాలు దాటినా, సగం జనాభాకు నిర్ణయాధికారం కల్పించడంలో  ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదు, మన సమాజపు నైతిక విలువల పతనం. భారత పార్లమెంటులో చర్చలు జరుగుతాయి, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారు. కానీ, 140 కోట్ల మంది భారతీయుల్లోని 
70 కోట్ల మంది మహిళలకు  పార్లమెంటులో  ప్రాతినిధ్యం ఎక్కడ?  

ప్రపంచ దేశాల  జాబితా తీస్తే  రువాండా నుంచి సౌదీ అరేబియా వరకు అనేక దేశాలు మహిళలకు  అగ్రతాంబూలం ఇస్తుంటే,  ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన భారత్ ఎందుకు  వెనుకబడింది?   లోక్​సభలో  ఉన్నది కేవలం 14% (78 మంది మాత్రమే).  ప్రపంచ సగటు 26% ఉంటే, మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. లోక్‌‌‌‌సభలో  543 మందిలో  కేవలం  మహిళలు 78 మాత్రమే అనగా 14.3% శాతం,  రాజ్యసభలో 245 మందిలో మహిళల సంఖ్య 31 మాత్రమే అనగా 12.6% శాతం  మాత్రమే!  ఇక రాష్ట్ర అసెంబ్లీల్లో  పరిస్థితి మహా దారుణం, రాష్ట్రాల అసెంబ్లీలలో  8–10% శాతమే అంటే 10% కూడా దాటడం లేదు.  ప్రతి పదిమంది నిర్ణేతల్లో  ఎనిమిది మంది 
పురుషులే.   మహిళల సమస్యలను,  వారి అవసరాలను, వారి బాధలను  ఎనిమిదిమంది పురుషులు  ఎంతవరకు అర్థం చేసుకోగలరు?  ప్రపంచలో మహిళల సగటు 26% శాతం..అంటే భారత్​లో  మహిళల  ప్రాతినిధ్యం ప్రపంచానికి   చెప్పుకునే స్థాయిలో  లేదన్నమాట.  ఇంకా  సగం దూరం  కూడా  చేరుకోలేదు.

ఎందుకు ఈ వాయిదా? 

2023లో మహిళా బిల్లు  వచ్చినప్పుడు  దేశంలోని  ప్రతి మహిళ  కళ్లలో  ఒక ఆశ మెరిసింది.  ఆ బిల్లు మహిళలకు 33%  రిజర్వేషన్  ఇస్తామని చెప్పింది.  ‘ఇక మన గొంతు చట్టసభల్లో వినిపిస్తుంది’ అని నమ్మింది.  కానీ, ఆ బిల్లుకు పెట్టిన  ‘కండిషన్లు’ ఒక పీడకలలా మారాయి.  డీలిమిటేషన్ జరగాలి, జనాభా లెక్కలు తేలాలి.. ఇవన్నీ సాకులు కావా?  మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తాం కానీ ఈ  డీలిమిటేషన్  బిల్లుకు ఏ మాత్రం  సపోర్ట్ చేయమని,  మహిళా  రిజర్వేషన్  బిల్లును  సెపరేటుగా  ప్రవేశపెట్టాలని  ప్రతిపక్షాలు  గగ్గోలు  పెట్టినా  పట్టించుకోకుండా  బిల్లును ప్రవేశపెట్టడం  వెనుక  అసలు  కారణాలేమిటి?      డీలిమిటేషన్ పేరుతో ఆలస్యం చేయడం.. 
న్యాయాన్ని  వాయిదా వేయడమే కాదా?  543 సీట్లలో 33%  ఇవ్వలేరా? 

డబ్బు రాజకీయాల దందా ! 

మహిళల మీద  అత్యాచారాలు జరిగినప్పుడు,  వారిని అవమానించినప్పుడు ఆ చట్టసభలే  కదా కన్నీరు పెట్టింది!  కానీ,  ఆ కన్నీళ్లు తుడిచే చట్టం చేయడానికి మాత్రం వారు ఎందుకు సిద్ధంగా లేరు?   మహిళలను  మనం  గౌరవిస్తాం అని ప్రతి ఎన్నికల ప్రణాళికలో రాసే రాజకీయ పార్టీలు,  అసలు అధికారంలోకి  వచ్చేసరికి  ఆ వాగ్దానాలను  ఎందుకు  తుంగలో  తొక్కుతాయి?  ఇది ఒక మాయాజాలం.  ఆమె ఓటు వేయడానికి  క్యూలో నిలబడితే ‘ప్రజాస్వామ్య శక్తి’ అని పొగుడుతారు.   అదే ఆమె సీటు అడిగితే ‘అర్హత’ ఏంటని ప్రశ్నలు వేస్తారు. 

 ఇంకో కఠిన వాస్తవం,  ఎంపీలలో 88% కోటీశ్వరులు.  వీరి సగటు ఆస్తి  రూ.20 కోట్లకు పైగా ఉంది. అంటే  పేద మహిళలకు అవకాశాలు తక్కువ,   రిజర్వేషన్  వచ్చినా కూడా  ‘డబ్బున్న  మహిళలకే’ అవకాశం.  అంటే  ఇది మహిళా  సాధికారతా?  లేక  కార్పొరేట్  విస్తరణ కోసమా?   మహిళా  రిజర్వేషన్  గురించి  మాట్లాడేటప్పుడు  ‘మహిళలు గెలుస్తారు కదా,  ఎందుకు రిజర్వేషన్?’ అని ప్రశ్నిస్తారు.  

రాజకీయాల్లో ఉండాలంటే ధనం ఉండాలి,  కులబలం  ఉండాలి,   రాజకీయ వంశం  ఉండాలి.  వీటిలో  ఏదీ లేని  సామాన్య  మహిళ  చట్టసభకు ఎలా వెళ్తుంది?   మనం కోరుకునేది కేవలం ఆడవాళ్లు చట్టసభల్లో ఉండటం కాదు..‘సామాన్య మహిళల గొంతు’ పార్లమెంటులో  వినిపించడం. 

చిత్తశుద్ధి ఉంటే… వై నాట్ నౌ? 

రాజకీయ నాయకులారా! మహిళలను ఓటుబ్యాంకులుగా మాత్రమే చూడకండి. స్త్రీని దేవతగా పూజించడం కాదు, ఆమెకు సమాన హక్కు ఇవ్వడమే నిజమైన పూజ. ఇప్పటికైనా కాలం మించిపోలేదు. మహిళలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, చదువు ద్వారా తమ హక్కులను తెలుసుకుంటున్నారు. ‘ఆకాశంలో సగం’ అని బుజ్జగించే కాలం చెల్లిపోయింది. ఇప్పుడు కావాల్సింది వాటా… 2023 చట్టాన్ని షరతులు లేకుండా, రాబోయే ఎన్నికల నుంచే అమలు చేయడానికి అన్ని పార్టీలు  ముందుకు రావాలి. 

ఇది ఏ ఒక్క పార్టీకి, ప్రాంతానికో సంబంధించిన సమస్య ఏమాత్రం కాదు. ఇది  దేశాభివృద్ధికి ముఖ్యంగా అనాదిగా అణచివేతకు గురవుతున్న ఆడబిడ్డలకు సంబంధించిన ఆత్మగౌరవ విషయమన్నది మరవొద్దు! ఇది మీరు దేశానికి చేసే అతి పెద్ద మేలు. మౌనంగా ఉన్న మహిళ అగ్నిపర్వతం అని గుర్తుంచుకోండి. మాకు భిక్ష వద్దు… మా హక్కు మాకు కావాలి! ఇప్పుడే కావాలి… మరే సాకుతో వాయిదాలు వేసి మా సహనాన్ని పరీక్షించకండి! 

– డాక్టర్. బి. హర్షిణి,మానసిక వైద్య నిపుణురాలు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 

హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.