Reading Time: 2 minutes

ఆల్కహాల్‌తో నడవనున్న కార్లు, బైక్స్: E85 పెట్రోల్ తెస్తున్న ప్రభుత్వం.. మరి పాత వాహనాల పరిస్థితి?

Caption of Image.

దేశంలో వాహనదారులు ఇప్పుడు E20 అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ గురించి వింటున్నారు. అయితే త్వరలోనే భారత ప్రభుత్వం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. పెట్రోల్‌లో ఆల్కహాల్ అదే ఇథనాల్ కలిపే రోజులు పోయి.. ఆల్కహాల్‌లోనే కొంచెం పెట్రోల్ కలిపి వాడే కొత్త E85 పెట్రోల్ రాబోతోందని తెలుస్తోంది. అంటే ఈ పెట్రోలులో 85 శాతం ఇథనాల్ ఉంటుంది మిగిలింది మాత్రమే పెట్రోల్ ఉంటుందట. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతున్న వేళ క్రూడ్ దిగుమతులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ‘E85’ డ్రాఫ్ట్ రూల్స్‌ను సిద్ధం చేసింది.

అసలు E85 అంటే ఏంటి?
E85 అంటే 85 శాతం ఇథనాల్ మిగిలిన 15 శాతం పెట్రోల్ ఉండే ఇంధనం. దీనినే ఫ్లెక్స్ ఫ్యూయల్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 90% ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కానీ ఇథనాల్‌ను మన దేశంలోనే చెరకు, మొక్కజొన్న.. ఇతర ధాన్యాల నుండి తయారు చేసుకోవచ్చు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా మన రైతులకు ఆర్థికంగా భారీ మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరి ప్రస్తుత వాహనాల్లో ఈ85 వాడొచ్చా?
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీ దగ్గర ఉన్న పాత పెట్రోల్ కార్లు, బైక్‌లో నేరుగా E85 పోయకూడదు. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లోని సాధారణ ఇంజిన్లు ఇంత ఎక్కువ స్థాయిలో ఉండే ఆల్కహాల్‌ను తట్టుకోలేవు. ఇది సీల్స్, హోస్‌లు, ఇంజిన్ భాగాలను తుప్పు పట్టేలా చేస్తుంది. కేవలం E85 కోసం ప్రత్యేకంగా రూపొందించే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు ఉన్న వాహనాల్లో మాత్రమే వాడాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే 100% ఇథనాల్‌తో నడిచే టయోటా కారును ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

ALSO READ : ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 2 సార్లు జీతం..

ప్రభుత్వ ప్లాన్ ఏంటి?
2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విక్రయాలు తప్పనిసరి అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం తదుపరి అడుగుగా E85ను ఒక ప్రత్యేక ఫ్యూయల్ గ్రేడ్‌గా తీసుకురానుంది. అంటే పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్‌తో పాటు E85 కోసం విడిగా నాజిల్స్, స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. రాబోయే రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనివల్ల లాభాల విషయానికి వస్తే.. క్రూడ్ దిగుమతులు తగ్గి దేశ సంపద ఆదా అవుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. అయితే సవాళ్లు కూడా తక్కువేం లేవు. కార్ల తయారీ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను వేగంగా తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే E85 ఇంధనంతో వాహనం ఇచ్చే మైలేజీ పెట్రోల్ వాహనాల కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.