
హైదరాబాద్: తెల్లారితే కొందరు నా చావు కోరుకుంటున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. నా చావు కోరుకుంటున్నారని కేసీఆర్ అనడం సరికాదని.. మేమేప్పుడు ఆయన చావుని కోరుకోలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులే సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టానురంగా ఏకవచనంతో మాట్లాడుతున్నారని.. జనం మార్పు కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉక్రోషంతో ఊగిపోతున్నారని విమర్శించారు.
పదేండ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. చివరకు ఔటర్ రింగ్ రోడ్డుని కూడా అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి దీన స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని జీవన్ రెడ్డి ఎందుకు నినాదాలు చేశారు..? పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందుకా.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా.. ఎందుకు రేవంత్ ప్రభుత్వం పోవాలని ప్రశ్నించారు.