
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఆర్టీసీ బస్సుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. 2026, ఏప్రిల్ 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. ఈ సమ్మెకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయని స్పష్టం చేశారాయన.
మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం అవుతున్నా.. ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవలేదని.. సమ్మె నివారణ కోసం కనీస చర్యలు తీసుకోవటం లేదన్నారాయన. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్న పట్టించుకోలేదని.. అధికారంలోని కాంగ్రెస్ పార్టీ.. తన మేనిఫెస్టో లో ఈ అంశాన్ని పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు జేఏసీ చైర్మన్ వెంకన్న. తప్పని పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామన్నారాయన.
EV బస్సులు తీసుకొస్తున్న ప్రభుత్వం.. హైదరాబాద్ డిపోల్లో ఉన్న ఉద్యోగులను జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తుందని.. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నారాయన. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలో భాగంగానే ఇస్తున్నారని విమర్శించారు జేఏసీ చైర్మన్ వెంకన్న.
సమ్మె చేయకుండా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఎవరు భయపడొద్దని.. కార్మికులు అందరూ సమ్మె చేయడానికీ సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టం చేశారాయన. కాలయాపన కోసమే కమిటీ అంటున్నారని.. మెట్రో రైల్ వ్యవస్థను వెంటనే విలీనం చేసిన ప్రభుత్వం.. ఆర్టీసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారాయన. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లటానికి జేఏసీ సిద్ధంగా ఉందని వెల్లడించారు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న.